పెళ్లిని ఆపేసిన రెండో ఎక్కం!

ABN , First Publish Date - 2021-05-04T01:19:20+05:30 IST

మీరు చదివింది నిజమే. పెళ్లి పందింట్లో రెండో ఎక్కం చెప్పలేకపోయిన వరుడును వధువు చీదరించుకుంది. నర్సరీ పిల్లలు

పెళ్లిని ఆపేసిన రెండో ఎక్కం!

మహోబా: మీరు చదివింది నిజమే. పెళ్లి పందింట్లో రెండో ఎక్కం చెప్పలేకపోయిన వరుడ్ని వధువు చీదరించుకుంది. నర్సరీ పిల్లలు చెప్పే రెండో ఎక్కం కూడా రాని వాడితో తాను కాపురం చేయలేనంటూ వివాహం రద్దు చేసుకుని వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.


శనివారం సాయంత్ర వరుడు బరాత్ మధ్య పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అయితే, అతడి విద్యార్హతలపై తొలి నుంచీ అనుమానంగానే ఉన్న వధువు పందిట్లోనే అతడిని రెండో ఎక్కం చెప్పాలని కోరింది.  కంగుతిన్న వరుడు.. పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేసి అవమానం పాలయ్యాడు. దీంతో పెళ్లి కొచ్చిన అతిథులు నోరెళ్లబెట్టారు. అనుమానించినదే నిజమైందని కన్నీళ్లు పెట్టుకుంటూ వధువు ఆ పెళ్లిని రద్దు చేసుకుంది. 


నిజానికి ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమే. వరుడుది మహోబా జిల్లాలోని ధవార్ గ్రామం. శనివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఇరు కుటుంబాల వారు పెద్ద ఎత్తున కల్యాణ మండపానికి చేరుకున్నారు. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు మూడుముళ్లు వేయాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. అంకెలు కూడా రాని వాడితో తాను జీవితాంతం కలిసి ఉండలేనంటూ వధువు వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు.  


పెళ్లి కొడుక్కి చదువుకోలేదని తెలిసి తామంతా షాకయ్యామని వధువు సోదరుడు చెప్పాడు. అతడు చదువుకోలేదన్న విషయాన్ని వరుడి తల్లిదండ్రులు దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు అసలు తన జీవితంలోనే స్కూలు ముఖం చూడలేదని తెలిసిందన్నాడు.


వారు తమను దారుణంగా మోసం చేశారని, అయినప్పటికీ వధువు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి పెళ్లిని రద్దు చేసుకుందని వధువు తరపు బంధువులు ప్రశంసించారు. తర్వాత ఈ గొడవలో పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఇరు కుటుంబాలు రాజీకొచ్చాయి. అప్పటి వరకు సమర్పించుకున్న బంగారు ఆభరణాలు, బహుమానాలను ఎవరివి వారికి తిరిగి ఇచ్చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. 

Updated Date - 2021-05-04T01:19:20+05:30 IST