దళితుని ఇంట భోజనం చేసిన యోగి ఆదిత్యనాథ్

ABN , First Publish Date - 2022-01-14T22:09:00+05:30 IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్

దళితుని ఇంట భోజనం చేసిన యోగి ఆదిత్యనాథ్

గోరఖ్‌పూర్ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఓ దళితుని ఇంట్లో భోజనం చేశారు. అమృత్‌లాల్ భారతి కుటుంబం ఆయనకు ఆతిథ్యమిచ్చింది. ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగిన మంత్రులు సమాజ్‌వాదీ పార్టీలో చేరుతూ, ఓబీసీలు, దళితులను యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. 


అమృత్‌లాల్ ఇంట్లో భోజనం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ విలేకర్లతో మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను ఐదేళ్ళపాటు పరిపాలించిందని, ఆ సమయంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద కేవలం 18,000 ఇళ్ళను మాత్రమే నిర్మించిందని చెప్పారు. తన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ళ  పదవీ కాలంలో ఈ పథకం క్రింద 45 లక్షల గృహాలను పేదలు, అణగారిన వర్గాలకు ఇచ్చిందన్నారు. 


ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో సామాజిక దోపిడీ జరిగిందని, సామాజిక న్యాయం జరగలేదని ఆరోపించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ (కేంద్ర, రాష్ట్ర) ప్రభుత్వాల హయాంలో 2.61 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఉజ్వల యోజన క్రింద 1.36 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు. వంశపారంపర్య రాజకీయాలు చేసేవారు సమాజంలోని ఏ వర్గానికీ న్యాయం చేయలేరని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని  ప్రభుత్వం దళితులు, పేదల హక్కులను దోపిడీ చేసిందని ఆరోపించారు. 


2012 నుంచి 2017 వరకు అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను పరిపాలించిన సంగతి తెలిసిందే. యోగి ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ తమ పదవులకు రాజీనామా చేసి, శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. యోగి ప్రభుత్వం దళితులను నిర్లక్ష్యం చేసిందని వీరు ఆరోపించారు. 


Updated Date - 2022-01-14T22:09:00+05:30 IST