Abn logo
Sep 19 2021 @ 13:34PM

యూపీలో నాలుగున్నరేళ్ళ సుపరిపాలన ఓ మైలురాయి : యోగి

లక్నో : ఉత్తర ప్రదేశ్‌కు బీజేపీ నాలుగున్నరేళ్ళలో సుపరిపాలనను అందించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తన ప్రభుత్వం నాలుగున్నరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 


ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో జాతీయ స్థాయిలో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని యోగి చెప్పారు. అంతకుముందు 14వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు.  పెట్టుబడులను నిలకడగా ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. గడచిన 54 నెలల్లో రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందని చెప్పారు. ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. 


మహిళలు, వ్యాపారస్థులు, సామాన్య ప్రజలకు భద్రతగల వాతావరణాన్ని తన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. నేర చరిత్రగలవారికి చెందిన దాదాపు రూ.1,800 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసిందని చెప్పారు. చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించినట్లు తెలిపారు. నేరగాళ్ళు, మాఫియాలతో కఠినంగా వ్యవహరించామన్నారు. వీరిపై చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని, వారి కుల, మతాలను దృష్టిలో పెట్టుకోలేదని వివరించారు. 


ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన సుమారు 42 లక్షల మందికి తన ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చిందని చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రజలకు రూ.5 లక్షల కోట్లు అందజేశామని చెప్పారు. 4.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించామన్నారు. నియామకాలు, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పాటించామన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption