నిరసనకారులను ఎదుర్కొనేందుకు ప్లాస్టిక్ స్టూల్.. వెదురుతట్ట పట్టుకున్న పోలీసులు!

ABN , First Publish Date - 2021-06-18T01:02:49+05:30 IST

కామెడీ ఎప్పుడూ సరదా సందర్భాల్లోనే పుట్టుకురాదు.. సీరియస్ ఘటనల్లోనూ పుట్టుకొస్తోంది.

నిరసనకారులను ఎదుర్కొనేందుకు ప్లాస్టిక్ స్టూల్.. వెదురుతట్ట పట్టుకున్న పోలీసులు!

లక్నో: కామెడీ ఎప్పుడూ సరదా సందర్భాల్లోనే పుట్టుకురాదు.. సీరియస్ ఘటనల్లోనూ పుట్టుకొస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో జరిగిన ఈ ఘటనను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిరసనకారులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల్లో ఒకరు తలకు ప్లాస్టిక్ స్టూలు ధరిస్తే మరొకరు వెదరుబుట్ట మూతను పట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..  రాష్ట్రంలోని అక్రంపూర్‌లో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబ సభ్యులు నిన్న ఆందోళన చేపట్టారు. మృతదేహాలతో ధర్నా చేసి రోడ్డును దిగ్బంధం చేశారు. 


వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు,  భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. వీరిలో కొందరి వద్ద తుపాకులు కూడా ఉన్నాయి. వీరందరూ కలిసి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో అప్పటికే ఆగ్రహంగా ఉన్న గ్రామస్థులు మరింత రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇందుకు సంబంధిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రామస్థుల రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ పోలీసు ప్లాస్టిక్ స్టూలును హెల్మెట్‌లా ధరిస్తే మరో పోలీసులు వెదరుబుట్ట మూతను కవచంగా పట్టుకున్నాడు. 


ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసులపై జోకులు పేలాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. సమస్య తీవ్రత తెలిసినా చేతుల్లో ఏం లేకుండా ఎలా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ.. ఎస్పీ, స్థానిక అధికారుల నుంచి వివరణ కోరారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసినట్టు యూపీ పోలీసులు ట్వీట్ చేశారు.

Updated Date - 2021-06-18T01:02:49+05:30 IST