మోదీకి సంకటంగా యూపీ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-10-27T08:33:58+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలపై బ్రాహ్మణవర్గాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నదని అక్కడి రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేసిన వారెవరికైనా అర్థమవుతుంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రంగా ఉన్న బ్రాహ్మణులు స్వాతంత్ర్యానంతరం...

మోదీకి సంకటంగా యూపీ ఎన్నికలు

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలపై బ్రాహ్మణవర్గాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నదని అక్కడి రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేసిన వారెవరికైనా అర్థమవుతుంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రంగా ఉన్న బ్రాహ్మణులు స్వాతంత్ర్యానంతరం కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకే మద్దతునిచ్చారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రులుగా ఉన్న అయిదుగురూ బ్రాహ్మణులు కావడం ఇందుకు నిదర్శనం. యుపి తొలి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ నుంచీ శ్రీపతి మిశ్రా వరకూ బ్రాహ్మణులే. కాని ఇప్పుడు బ్రాహ్మణులు దాదాపు భారతీయ జనతాపార్టీ వైపు ఉన్నారు. గోవింద్ వల్లభ్ పంత్ కుమారుడు కెసి పంత్ కాంగ్రెస్‌లో కొన్ని దశాబ్దాలు అధికారం అనుభవించారు. బోఫోర్స్ కుంభకోణం దుమారం చెలరేగుతున్న సమయంలో ఆయన రక్షణమంత్రిగా ఉన్నారు. బోఫోర్స్‌కు సంబంధించి కాగ్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు ఆయన రాజీవ్ ప్రభుత్వాన్ని గట్టిగా వెనకేసుకువచ్చారు. అలాంటి వ్యక్తి  1998లో బిజెపిలో చేరారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి కెసి పంత్‌ను ప్రణాళికాసంఘానికి డిప్యూటీ చైర్మన్‌ను చేశారు. కెసి పంత్ భార్య ఇలా పంత్ కూడా బిజెపి తరపున పోటీ చేసి విజయం సాధించారు. మరో ముఖ్యమంత్రి హేమవతీ నందన్ బహుగుణ 1969లో కాంగ్రెస్ చీలినప్పుడు కమలాపతి త్రిపాఠీతో పాటు ఇందిరాగాంధీకి అండగా నిలిచారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి ఎదురు తిరిగారు. లక్నోలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్‌కు స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వంత పార్టీ స్థాపించారు. ఆయన కుమార్తె రీటా బహుగుణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, యుపిసిసి అధ్యక్షురాలిగా పనిచేసినప్పటికీ పరిస్థితులు గమనించి బిజెపిలో చేరారు. ఆమె కుమారుడు విజయ్ బహుగుణ కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అతడి కుమారుడు కూడా ప్రస్తుతం బిజెపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీపతి మిశ్రా కుమారుడు రాకేశ్ మిశ్రా కమలం నీడన చేరారు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాలుగా విధేయంగా ఉన్న కమలాపతి త్రిపాఠీ కుటుంబం కూడా తర్వాతి కాలంలో కాంగ్రెస్‌కు దూరమయింది. ఆయన మనుమడు రాజేశ్ పతి త్రిపాఠీ, మునిమనుమడు లలితేశ్ త్రిపాఠీ ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. రాజీవ్‌గాంధీ, పి.వి. నరసింహారావులకు రాజకీయ కార్యదర్శిగా ఉన్న జితేంద్ర ప్రసాద తర్వాతి కాలంలో సోనియాగాంధీపై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆయన కుమారుడు జితిన్ ప్రసాద గత ఏడాది బిజెపిలో చేరి యోగీ ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మంత్రి పదవిని స్వీకరించారు. సంజయ్ గాంధీ చెప్పులు మోస్తానన్న మరో మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ తన సతీమణితో సహా చరమ దశలో కాషాయ కండువా కప్పుకున్న  విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రమోద్ తివారీ వంటి ఒకరిద్దరు బ్రాహ్మణ నేతలు తప్ప ఎవరూ మిగల్లేదు.


ఈ నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్‌లో, ఇటీవలి కాలంలో సుడిగాలిలా పర్యటనలు చేస్తూ లఖీంపూర్ ఖేరీతో సహా ఎక్కడ దారుణాలు జరిగినా అక్కడికి వెళుతున్న ప్రియాంకా వాధ్రా గాంధీ భారతీయ జనతాపార్టీ నుంచి బ్రాహ్మణులను ఎంతమేరకు కాంగ్రెస్ వైపు తిప్పుకోగలరు? సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ నేత మాయావతి కూడా  బ్రాహ్మణుల సమ్మేళనాలను నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఆ వర్గాన్ని ఏ విధంగా ఆకర్షించగలదు? యుపిలో దళితులు, యాదవుల తర్వాత బ్రాహ్మణులు పెద్దసంఖ్యలో, దాదాపు 12 శాతం మేరకు ఉన్నారు. వారు ఎటువైపు ఉంటే అక్కడ విజయావకాశాలను ప్రభావితం చేయగలరని రాజకీయ పరిశీలకుల అంచనా. రామజన్మభూమి ఉద్యమం పుంజుకుంటున్న కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా మారింది. ఆ తర్వాతి కాలం నుంచి ఏ పార్టీ పూర్తి మెజారిటీ సంపాదించలేదు. ఇందుకు ప్రధాన కారణం బ్రాహ్మణులు బిజెపి వైపు మొగ్గు చూపడమే. కాని 2007 అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బ్రాహ్మణులకు ప్రాధాన్యం పెంచడంతో బిఎస్‌పి మెజారిటీ సీట్లు సాధించింది. కాని 2014 ఎన్నికల్లో మోదీ సారథ్యంలో బిజెపి ప్రభంజనం వీయడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ ఎన్నికల్లో 72 శాతం బ్రాహ్మణులు బిజెపికి ఓటు వేయడంతో ఆ పార్టీలు దాదాపు 40 శాతం ఓట్లను సాధించగలిగింది. 2017, 2019 ఎన్నికల్లో కూడా ఈ పరిణామం కొనసాగింది. ఈ ఎన్నికల్లో 80 నుంచి 82 శాతం బ్రాహ్మణ ఓట్లు బిజెపికి లభించాయి. అప్పటి నుంచీ బిజెపి బ్రాహ్మణ ఓట్లు యదాతథంగా ఉండగా, సమాజ్ వాది పార్టీ యాదవులు, ముస్లింల ఓట్లపై, బిఎస్‌పి దళితుల ఓట్లపై ఆధారపడసాగాయి. బ్రాహ్మణ ప్రాధాన్యాన్ని గుర్తించినందువల్లే బిజెపి సాధ్యమైనంతమేరకు ఇతర పార్టీలనుంచి వారిని తమ వైపుకు లాగడం ప్రారంభించింది. యోగీ ఆదిత్యనాథ్ తాజా మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆయన మంత్రివర్గంలో బ్రాహ్మణుల సంఖ్య ఆరుగురికి పెరిగింది. ఒక అంచనా ప్రకారం ఇటీవల లఖీంపూర్ ఖేరీలో రైతులపై వాహనం తొక్కించి నలుగురి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అరెస్టుకు పోలీసులు వెనుకాడడానికి, అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించకపోవడానికి, వారిని  బిజెపి నేతలు పల్లెత్తు మాట కూడా అనకపోవడానికి  ప్రధాన కారణం వారు బ్రాహ్మణవర్గానికి చెందిన వారు కావడమే. 2013లో ముజఫర్‌నగర్ మతకల్లోలాలు, 2019లో పుల్వామా బాలాకోట్ ఘటనలు ఉపయోగపడితే ఈ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిరనిర్మాణం తమకు అనుకూలంగా పరిణమిస్తుందని బిజెపి విశ్వసిస్తోంది. మత మార్పిడి నిషేధ చట్టం, జనాభా నియంత్రణ చట్టం, అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చడం, అలీఘడ్‌ను హరిఘడ్‌గా మారుస్తాననడం, తాజాగా ఫైజాబాద్ స్టేషన్‌ను అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్‌గా మార్చడం మత ప్రాతపదికన ఓట్లను చీల్చేందుకు చేసే ప్రయత్నాలుగానే పరిశీలకులు భావిస్తున్నారు. పైగా యోగీ ఆదిత్యనాథ్ అద్భుతంగా ఒక వర్గం వారిని రెచ్చగొట్టడంలో దిట్ట. 2017కు ముందు ‘అబ్బాజాన్’ లకే అధిక ప్రయోజనాలు దక్కాయని ఆయన ఒక ప్రసంగంలో అనడం ద్వారా సమాజ్ వాది పార్టీ హయాంలో ముస్లింలే లాభపడ్డారన్న సంకేతాన్ని జనానికి అందించారు. మరో వైపు అప్నాదళ్, నిషాద్ పార్టీ, సుహుల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ  వంటి వాటితో పొత్తు పెట్టుకోవడం ద్వారా బిజెపి ఓబీసీలను కూడా చీల్చగలిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బిఎస్‌పి ఓట్లను చీల్చేందుకు కూడా బిజెపి వ్యూహం రచించింది. ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్‌గా ఉన్న బేబీ రాణీ మౌర్యను రంగంలోకి దించారు. నిజానికి  2017 ఎన్నికల్లోనే యుపి అసెంబ్లీలోని 403 సీట్లలో 85 రిజర్వుడు సీట్లుకాగా వాటిలో బిజెపి 75 సీట్లను గెలుచుకుంది. ఇదే ఎన్నికల్లో దాదాపు 150 మంది యాదవేతర ఓబీసీలకు  సీట్లు ఇచ్చి వారి ఓట్లను చీల్చింది. యుపిలో దాదాపు 16 చిన్నా చితక పార్టీలు ఎన్నికల బరిలో దిగడం ఆ పార్టీకి ప్రయోజనమే కాని నష్టం లేదని రాజకీయవర్గాల అంచనా. ఈ వ్యూహాల వల్లే యుపిలో దాదాపు 25శాతం ముస్లింలు ఉన్నప్పటికీ బిజెపి పూర్తిగా హిందూ ఓట్లతో విజయం సాధించగలిగింది. హైదరాబాద్‌కు చెందిన ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ వంద సీట్లకు పోటీ చేయడం కూడా ఈ ఎన్నికల్లో బిజెపికి లాభం చేకూరింది. 2017 మునిసిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 78 సీట్లకు పోటీ చేసి 30 సీట్లు గెలుచుకుంది. ఒక మునిసిపల్ కౌన్సిల్‌కు ఎంఐఎం నేత చైర్మన్ కూడా అయ్యారు. పౌరసత్వ చట్టం, సాగు చట్టాల తర్వాత ముస్లింలు, జాట్లు, యాదవులు ఏకమయ్యారన్న విశ్లేషణలు వస్తున్న సమయంలో ఒవైసీ సమాజ్ వాది పార్టీకి ప్రధానంగా ఎంతో కొంత నష్టం చేయగలరన్నవిషయంలో సందేహం లేదు.


అటు బ్రాహ్మణులు, ఇటు ఇతర వర్గాలు ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి, సమాజ్‌వాది పార్టీల మధ్య తమ స్థానాన్ని నిర్ధారించుకుంటున్న సమయంలో బహుజన సమాజ్ పార్టీ అస్తిత్వ పరీక్షను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన నేతలు బిజెపి, సమాజ్‌వాది పార్టీల్లో సర్దుకుంటున్నారు. ఒకప్పుడు కాన్షీరామ్ యుపి అంతా సైకిల్‌పై తిరిగి నిర్మించిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. ఇందుకు పూర్తిగా మాయావతి నాయకత్వ విధానాలే కారణమని చెప్పక తప్పదు. ఇక అప్నాదళ్ కంటే చిన్న పార్టీ అయిన కాంగ్రెస్‌లో ప్రియాంక హడావిడి తప్ప ఊపు కనిపించడం లేదు. మహా అయితే ఈ సారి కాంగ్రెస్ ఓట్లు పెరగవచ్చేమో కాని సీట్లు వచ్చే అవకాశాలు తక్కువ. 2017లో కాంగ్రెస్‌కు కేవలం ఏడు అసెంబ్లీ సీట్లే వచ్చాయి. ప్రియాంక వాటిని నిలబెట్టుకుని ఒకటి రెండు సీట్లు పెంచగలిగితే అదే గొప్ప.


ఈ ఎన్నికల్లో బిజెపి వ్యూహరచన, ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం, యోగీని మించిన నేత లేకపోవడం వల్ల బిజెపి సీట్లు కొన్నితగ్గినా విజయావకాశాలకు ఢోకా లేదని, లఖీంపూర్ ఖేరీ పెద్దగా ప్రభావం చూపదని యుపికి చెందిన రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. రానున్న కాలంలో వారి అంచనాలు నిజమో కాదో తెలుస్తుంది. కాని ఈ ఎన్నికల్లో యోగీ గెలిస్తే బిజెపిలో ఆయన మోదీ తర్వాత నంబర్ 2గా మారక తప్పదు. దేశంలో అనేక మంది ఆధిపత్యాలకు గండి కొట్టగలిగిన మోదీ యోగీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. కనుక యూపీ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడు సిద్ధం కాక తప్పదు, బిజెపి దెబ్బతింటే అది మొత్తంగా మోదీ గ్రాఫ్‌ను ప్రభావితం చేయడం కూడా ఖాయం. ఏది జరిగినా మోదీకి సంకటమే.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-10-27T08:33:58+05:30 IST