యూపీలో పార్టీలకు ‘తూర్పు’ దిక్కు!

ABN , First Publish Date - 2022-01-23T07:26:57+05:30 IST

పూర్వాంచల్‌లో గత 15 ఏళ్లలో మూడు వేర్వేరు పార్టీలు అధిక స్థానాలను గెలిచి అధికారంలోకి వచ్చాయి. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి ఓటు వేసిన దాఖలాల్లేకపోవడంతో ఈ దఫా వారు ఎటువైపు మొగ్గుతారా అన్న ఉత్కంఠ అన్ని పార్టీల్లో నెలకొంది....

యూపీలో పార్టీలకు ‘తూర్పు’ దిక్కు!

బీజేపీ భవిష్యత్‌ను తేల్చే పూర్వాంచల్‌.. 26 జిల్లాలు.. 156 అసెంబ్లీ స్థానాలు.. ఎవరెక్కువ సాధిస్తే వారిదే పీఠం

ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్‌గా పేరొందిన తూర్పు యూపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో 

కీలకంగా మారింది. ఇక్కడి 26 జిల్లాలు పాలక బీజేపీ రాజకీయ భవిష్యత్‌ను 

తేల్చనున్నాయి. ఈ జిల్లాల్లోని 156 అసెంబ్లీ సీట్లలో అత్యధికం గెలిచిన వారే 

రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో బీఎ్‌సపీ 

పట్టుకోల్పోయి.. బాగా బలహీనపడిన నేపథ్యంలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, 

సమాజ్‌వాదీ పార్టీ నడుమే ముఖాముఖి పోరు సాగుతోంది.


పూర్వాంచల్‌లో గత 15 ఏళ్లలో మూడు వేర్వేరు పార్టీలు అధిక స్థానాలను గెలిచి అధికారంలోకి వచ్చాయి. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి ఓటు వేసిన దాఖలాల్లేకపోవడంతో ఈ దఫా వారు ఎటువైపు మొగ్గుతారా అన్న ఉత్కంఠ అన్ని పార్టీల్లో నెలకొంది. 2007లో పూర్వాంచల్‌లో బీఎ్‌సపీ 70 సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 85 సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి కాగలిగారు. 2017లో మొత్తం 403 స్థానాలకు గాను బీజేపీ ఒక్క పూర్వాంచల్‌లోనే ఏకంగా 106 సీట్లు సాధించింది. పూర్వాంచల్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట అయిన ఆజంగఢ్‌ తప్ప వారాణసీ, మీర్జాపూర్‌, బడోహి తదితర జిల్లాల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈసారి కూడా బీజేపీ ఈ ప్రాంతంలో పట్టు నిలబెట్టుకుంటుందా అని  రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వారాణసీ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం కావడం.. గోరఖ్‌పూర్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట కావడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇది పసిగట్టే మోదీ గత కొద్ది నెలల్లోనే అనేక సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పూర్వాంచల్‌ కేంద్రంగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపు 70 రోజులపాటు పూర్వాంచల్‌లో బీజేపీ నాయకత్వం పార్టీ కార్యకర్తలతో వందలాది భేటీలు జరిపింది. అయితే.. 2017 నుంచి ఇప్పటికి పూర్వాంచల్‌లో రాజకీయంగా పలు మార్పులు వచ్చాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యాదవేతర ఓబీసీలకు అడ్డా అయిన ఈ ప్రాంతంలో అనేక మందిని బీజేపీ ఆకర్షించినప్పటికీ.. గత ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజభర్‌, తివారీ వర్గీయులు ఇప్పుడు సమాజ్‌ వాదీ వైపు మొగ్గు చూపుతున్నారని.. సుహెుల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ కూడా దానితో పొత్తు కుదుర్చుకుందని చెబుతున్నారు. యాదవేతర ఓబీసీలైన మౌర్య, కుర్మీ తదితర కులాల ప్రముఖ నేతలంతా ఎస్‌పీలో చేరడం బీజేపీకి ఇబ్బంది కలిగించేవేనని అంటున్నారు. కాగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌ అధికార్‌ పార్టీ, భారత్‌ ముక్తి మోర్చాతో పొత్తు కుదుర్చుకున్నట్లు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం వెల్లడించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు ఉంటారని తెలిపారు. మరోవైపు.. యూపీ ఎన్నికల్లో ఎన్నికల్లో రెండో దశకు 23 మంది ముస్లింలు, 10మంది ఎస్సీ సామాజికవర్గం వారితో కూడిన 51 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం విడుదల చేశారు. ఇక.. గోవాలో మాజీ సీఎం, దివంగత మనోహర్‌ పర్రీకర్‌ కుమారుడు ఉత్పల్‌ పర్రీకర్‌ బీజేపీకి రాజీనామా చేసిన మరుసటి రోజే ఆ పార్టీ నేత, మాజీ సీఎం లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.


ఇక్కడి ప్రజలు స్వేచ్ఛాప్రియులు..

ఒకప్పుడు చంద్రశేఖర్‌, రాజ్‌ నారాయణ్‌, జానేశ్వర్‌ మిశ్రా వంటి సోషలిస్టు నేతలకు అడ్డా అయిన పూర్వాంచల్‌లో ఇప్పుడు సోషలిస్టు ఉద్యమ ఛాయలు లేకపోయినా ఒకే పార్టీకి కట్టుబడే అలవాటు ప్రజలకు లేదని ఓ సీనియర్‌ జర్నలిస్టు విశ్లేషించారు. ఇక్కడి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని, ప్రభుత్వం అతిగా ప్రచారం చేస్తే దానికే బెడిసికొడుతుందని గోరఖ్‌పూర్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ హర్ష్‌ సిన్హా వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్‌లో కొత్త ముఖాలు

యూపీ ఎన్నికల్లో కొత్త వారికి కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటిదాకా ఆ పార్టీ ప్రకటించిన 166 మంది అభ్యర్థుల్లో 119 మంది కొత్తవారే ఉన్నారు. అలాగే 40 శాతం సీట్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా మహిళలకు ఇచ్చారని కాంగ్రెస్‌ ప్రతినిధి అన్షూ అవస్థీ తెలిపారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌ (55), సామాజికవేత్త పూనమ్‌ పాండే తదితరులకు టికెట్లు ఇచ్చారన్నారు. కాగా అలీగఢ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సల్మాన్‌ ఇంతియాజ్‌ అలీగఢ్‌ జిల్లాలో ప్రవేశించకుండా అధికారులు నిషేధించారు.

Updated Date - 2022-01-23T07:26:57+05:30 IST