మోదీపై అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-09-15T01:26:47+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో నేరాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

మోదీపై అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో నేరాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తప్పుబట్టారు. రికార్డులను పరిశీలించి మాట్లాడాలని సలహా ఇచ్చారు. అబద్ధాలు చెప్పడంలో ఉత్తమ శిక్షణ సంస్థను బీజేపీ నడుపుతోందని మండిపడ్డారు. ఎన్నికల గుర్తుగా బుల్డోజర్‌ను ఎంచుకోవాలని సూచించారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2017కు పూర్వం రాష్ట్రాన్ని గ్యాంగ్‌స్టర్లు, మాఫియా నడిపించిందన్నారు. ఆయన పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీ పరిపాలనను ప్రస్తావించారు. 


దీనిపై అఖిలేశ్ యాదవ్ మంగళవారం విలేకర్ల సమావేశంలో స్పందించారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం మంచిదేనని, అయితే బీజేపీ అబద్ధాలు చెప్పడంలో శిక్షణనిచ్చే ఉత్తమ శిక్షణ సంస్థను నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. అయోధ్యలో కొన్ని ఇళ్ళను కూల్చివేయడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, బీజేపీ ఎన్నికల గుర్తుగా బుల్డోజర్‌ను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. 


ప్రతిపక్షాలకు దార్శనికత లేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ, యోగి తన కళ్లను పరీక్ష చేయించుకోవాలన్నారు. 


రాష్ట్రంలో నేరాల సంఘటనలపై మోదీ వ్యాఖ్యలను అఖిలేశ్ ఖండించారు. హోం డిపార్ట్‌మెంట్ నుంచి లేదా 100కు ఫోన్ చేసి డేటాను తెప్పించుకుని పరిశీలించాలని మోదీకి చెప్పారు. ఎవరి హయాంలో నేరాలు పెరిగాయో సరి చూసుకోవాలని తెలిపారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదికలను కూడా పరిశీలించి, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి అత్యధిక నోటీసులు ఏ రాష్ట్రానికి వచ్చాయో తెలుసుకోవాలన్నారు. 


సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్వగ్రామం బటేశ్వర్‌లో ఓ విశ్వవిద్యాలయం లేదా కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. 


Updated Date - 2021-09-15T01:26:47+05:30 IST