కౌలు మస్తు పిరం

ABN , First Publish Date - 2021-06-18T08:50:21+05:30 IST

పంట చేతికొస్తుందన్న మాటేగానీ రైతుకు మిగిలేదెంత? దుక్కులు సిద్ధం చేయడం, విత్తనం అలకడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగుల మందులు చల్లడం..

కౌలు మస్తు పిరం

  • గుదిబండగా బటాయి ఖర్చు.. కౌలురైతుల దిగాలు
  • నీటివసతి ఉంటే ఎకరానికి రూ.30 వేల దాకా
  • ఆరుతడి పంటలకు రూ.20 వేలకు పైగానే 
  • వెయ్యి నుంచి రూ.5వేల దాకా పెరిగిన కౌలు
  • సాగునీరు అందుబాటులోకి రావడంతోనే
  • కౌలు రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఏవి? 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వేడుకోలు


నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): పంట చేతికొస్తుందన్న మాటేగానీ రైతుకు మిగిలేదెంత? దుక్కులు సిద్ధం చేయడం, విత్తనం అలకడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగుల మందులు చల్లడం.. ఇలా అన్నీ పైసా పైసా లెక్కిస్తే కొన్నిసార్లు ఏమీ మిగలవు. మధ్యలో అతిగా వానలు పడ్డా.. అస్సలు పడకపోయినా దిగుబడి రాక  రైతు నష్టాలపాలై అప్పుల్లో కూరుకుపోతాడు! సొంత భూమిని సాగుచేసే రైతుకే ఇన్ని తిప్పలుంటే కౌలురైతుల మాటేమిటి? వారికి ఏటేటా బటాయి ఖర్చు గుదిబండగా మారుతోంది. రెక్కల కష్టం చేసేందుకు సత్తువ, యవుసంపై ఆసక్తి ఉన్నా భూమి లేని వాళ్లు భూమిని బటాయికి తీసుకొని సాగుచేసుకుంటున్నారు. ఇందుకుగాను పంటకాలానికిగాను భూ యజమానికి కౌలు కింద కొంత మొత్తం చెల్లిస్తారు! ఇప్పుడీ ఖర్చు కాలుదార్లకు  తలకుమించిన భారమవుతోంది. కౌలును చాలాచోట్ల యజమానులు పెంచేశారు. నిరుడు ప్రాజెక్టుల కింద, బోరుబావుల కింద నీటి వసతి ఉండే భూమికి  ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉండగా.. ఈసారి అది కాస్తా రూ.25వేల నుంచి రూ.30వేల దాకా పెరిగింది. నీటి వసతలి లేని చోట్ల వర్షాధార పంటలు వేసే భూముల కౌలు రేట్లూ పెరిగాయి. చాలాచోట్ల ఎకరానికి రూ.20వేలకు (రెండు పంటలకు) పైగా కౌలు తీసుకుంటున్నారు. వానాకాలం సీజన్‌ మొదలుకావడంతో యవుసం పనులకు సిద్ధమవుతున్న కౌలు రైతులకు ఈ రెట్లు కలవరపెడుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో లక్షల సంఖ్యలో కౌలురైతులున్నారు. కౌలునే నమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. ఏటేటా బటాయి ఖర్చు పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరుటితో పోల్చితే కౌలు ఖర్చు రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల వరకు పెరగడంతో తల పట్టుకుంటున్నారు. 


ప్రాజెక్టుల్లోకి నీళ్లు రావడంతో 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిరుడు రెండు పంటలు పండే భూములకు ఎకరానికి కౌలు రేటు రూ.23 వేల నుంచి రూ.26 వేల మద్యన ఉండగా ఈసారి రూ.26వేల నుంచి రూ.30 వేల మధ్య పలుకుతోంది. శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో సాగునీరు అందుబాటులో ఉండటంతో ఈ రేట్లు అమాంతం పెరిగాయి. ఒకే పంట పండే భూములకు ఎకరాకు రూ.15 వేల వరకు కౌలు తీసుకుంటున్నారు. పత్తి పండే భూములకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కౌలుకు ఇస్తున్నారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో పత్తి పండే నల్లరేగడి భూములకు ఎకరం రూ.15 వేల నుంచి రూ.17వేల దాకా పలుకుతోంది. ఇతర భూములకు ఒకే పంట పండే వాటికి రూ.పదివేల వరకు ఉండగా రెండు పంటలు పండే భూములకు రూ.20 వేల వరకు కౌలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి రావడంతో కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలో రెండు పంటల వరి పండే భూములకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు పలుకుతోంది. ఒక పంటకు రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు తీసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలో మిర్చి పండించే భూములకు ఎకరాకు రూ.25వేల వరకు పలుకుతోంది. క్రితంసారి ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో రూ. 18వేల నుంచి రూ. 20 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.25 వేల మద్యన ఉంది.


ఇతర పంటలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపే ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో రెండు పంటలు వరి పండే భూములకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఽకౌలు తీసుకుంటున్నారు.  రూరల్‌ జిల్లా పరిధిలో  మెట్ట పంటలు పండే భూములకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు కౌలు నడుస్తోంది. ఖమ్మం జిల్లాలో మిర్చి పండే భూములకు ఎకరం రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు కౌలు పెంచారు. మిర్చి పండే ప్రాంతాలను బట్టి ఈ ధరలు ఉన్నాయి. వరి పండించే భూములకు మాత్రం రెండు పంటలు పండేవాటికి రూ.20 వేల వరకు ఉన్నాయి. గద్వాల జిల్లా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద విత్తనపత్తి, మిరప, వాణిజ్య పత్తి సాగయ్యే భూములకు కౌలు బాగా పెరిగింది. రూ.20వేల నుంచి రూ.25వేల దాకా తీసుకుంటున్నారు. 


ఆరుగాలం శ్రమించినా అప్పులే 

కౌలు రైతులు కష్టపడి పండిస్తున్నా కొన్నిసార్లు ప్రకృతి ప్రకోపంతో దెబ్బతింటున్నారు. వ్యాపారులు, ఇతరుల నుంచి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినా.. ఫలితం ఉండటం లేదు. సరైన దిగుబడి రాక నష్టపోతున్నారు. కౌలు రైతులు దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వ పథకాలు కూడా వారి దరి చేరడం లేదు. పంట పెట్టుబడి రుణాలు కూడా అందడం లేదు. కౌలు రైతులను అధికారికంగా గుర్తిస్తామన్న హామీ కూడా నేరవేరడం లేదు. కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు అందజేస్తే బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.  పట్టాదారులు, ధనిక రైతులు నగరాల్లో ఉంటూ తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. పైగా కౌలు ధరలు కూడా తగ్గించకుండా ఏటా పెంచుతూనే ఉండటంతో ఫలితం ఉండటం లేదు. కౌలు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఎకరానికి రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేల సహాయాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద కేంద్రం సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తోంది. కానీ కౌలు రైతులకు మాత్రం నయాపైసా విదిల్చడం లేదు. 


 కౌలుతో పాటు పెట్టుబడి కూడా పెరిగింది

గత సీజన్‌లో ఎకరానికి రూ.9వేలు చెల్లించాను. ఈ సీజన్‌లో ఎకరానికి రూ.10 వేలకు పెంచారు. తప్పని పరిస్థితుల్లో రూ.30వేలు చెల్లించి మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నా.. రెండెకరాల్లో వరి పంట, ఎకరంలో పత్తి పంట సాగు చేస్తాను. కౌలుతోపాటు పెట్టుబడి ఖర్చు కూడా బాగా పెరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కౌలు రైతులకు పంట రుణాలు, రైతు బంధు అందిస్తే బాగుంటుంది.

- దాసరి గణేశ్‌, కౌలు రైతు, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల జిల్లా  


ఏటా కౌలు పెంచుతున్నారు

సాగునీరు అందుబాటులోకి రావడంతో యేటా కౌలు పెంచుతున్నారు. పంట పండినా పండకున్నా కౌలు ఇవ్వాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఆధారం లేక తీసుకుంటున్నాం. నిరుడు ఎకరానికి రూ.23 వేలకు కౌలు ఇస్తే.. ఈసారి రూ.3వేలు ఎక్కువగా పెట్టి రూ.26 వేలకు ఐదెకరాలు తీసుకున్నాను. పెట్టుబడులతో కలిసి భారీగా పెట్టాల్సి వస్తోంది. కౌలు రైతులకు పంట రుణాలు ఇస్తే మేలు జరుగుతుంది.

- గంగాధర్‌,  కౌలు రైతు, పోతంగల్‌, నిజామాబాద్‌ జిల్లా

Updated Date - 2021-06-18T08:50:21+05:30 IST