Abn logo
Oct 13 2020 @ 00:18AM

పాత్రికేయునిపై ‘ఉపా’

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం ‘ఉపా’ కింద అరెస్టు చేసిన కేరళ పాత్రికేయుడు సిద్ధిఖి కప్పన్‌ బెయిల్‌ నిమిత్తం మొదట హైకోర్టును సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచిం చింది. పిటిషన్‌ను కొట్టివేయడం లేదని, నాలుగువారాల దాకా దీన్ని చెల్లుబాటులోనే ఉంచుతామని, ఈలోగా హైకోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నించమని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ‘‘ఇంకెక్కడి బెయిలు, ఉపా ప్రయోగించారు, నెలల తరబడి అట్లా జైలులో మగ్గిపోవలసిందే’’– అని కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ తరఫున కప్పన్‌ కేసును వాదిస్తున్న ప్రసిద్ధ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. నిజానికి పిటిషనర్లు వేసినది హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌. కప్పన్‌ ఆచూకీ తెలియడం లేదని, అతనిని కోర్టులో హాజరుపరచాలని యూనియన్‌ అభ్యర్థించింది. 


కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానంలో దేశంలో నెలకొని ఉన్న మానవహక్కుల పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. ‘‘అంత ఆలస్యం ఏమి జరగదు లెండి, సరైన కోర్టును మొదట సంప్రదించాలి కదా, అక్కడ కాకపోతే, ఇక్కడికి రండి, కేసును 4 వారాలు వాయిదా వేస్తున్నాము అంతే’’ అని న్యాయస్థానం సర్ది చెప్పింది కానీ, నెలల తరబడి బెయిల్‌ పిటిషన్‌లను విచారణకు కూడా తీసుకోకుండా, తీసుకున్నా రకరకాల కారణాలతో వాయిదాల మీద వాయిదాలు వేసేట్టు ప్రభుత్వ పక్షం ప్రయత్నిస్తున్న ఎన్నో కేసులను చూస్తున్నాము. 


పాత్రికేయుడు కప్పన్‌ వృత్తిధర్మంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ హథ్రాస్‌లో బాధిత కుటుంబాన్ని కలవడానికి వెడుతున్నారు. జరిగిన నేరంపై సక్రమమైన చర్యలు తీసుకోవడం సంగతి ఎలా ఉన్నా, తమ ప్రభుత్వం మీద అంతర్జాతీయ కుట్ర ఒకటి జరిగిందని, అందులో గుర్తు తెలియని, సంఖ్య తెలియని అనేకమంది పాల్గొన్నారని ఒక కేసు అయితే యుపి పోలీసులు తయారుచేసి పెట్టారు. కప్పన్‌దీ, అతనితో పాటు ప్రయాణించి వస్తున్న మిత్రులది కేరళ. పైగా వారు మైనారిటీ మతస్థులు. దానితో, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు దీనితో సంబంధం ఉన్నదని, యుపిలో అలజడి రేపడానికి వందకోట్ల విదేశీ సొమ్ము వచ్చిందని, ఒక కథనం రూపొందింది. ఒకేసారి 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హథ్రాస్‌ సామూహిక అత్యాచారం, హత్య విషయంలో ఉత్తరప్రదేశ్‌ ఆశ్చర్యకరమైన ధోరణిలో ప్రవర్తిస్తున్నది. సందర్శించడానికి వచ్చే రాజకీయనాయకులను నిరోధించడంతో పాటు, వచ్చే వారందరిపైనా కేసులు తప్పవన్నట్టు వ్యవహరించడం తెలిసిందే. ఇండియా టుడే గ్రూపునకు చెందిన ఒక జర్నలిస్టుకి, హథ్రాస్‌ బాధితురాలి కుటుంబసభ్యులకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఈ మధ్య ప్రచారంలో పెట్టారు. పాత్రికేయుల సంభాషణలను దొంగచాటుగా వింటున్నారని దాని వల్ల అర్థమవుతోంది. 


ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పాత్రికేయులపై ఇటువంటి వివాదాస్పద రీతిలో వ్యవహరించడం ఇదే మొదలు కాదు. ‘స్ర్కోల్‌’ అన్న వార్తా వెబ్‌సైట్‌కు రిపోర్టర్‌గా పనిచేస్తున్న సుప్రియాశర్మ అనే పాత్రికేయురాలు, లాక్‌డౌన్‌ కారణంగా ఒక దళిత కుటుంబం అనుభవిస్తున్న కష్టాలను రిపోర్ట్‌ చేస్తే, ఆమెపై ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. మరో వెబ్‌ పత్రిక ‘వైర్‌’ సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్‌కు పరువునష్టం కేసులో సమన్లు జారీ చేయడానికి కరోనాకట్టడుల కాలంలో పోలీసులు ఫైజాబాద్‌ నుంచి ఢిల్లీ దాకా వచ్చారు. 


మానవహక్కుల విషయంలో ఖాతరు లేని ప్రభుత్వాల హయాంలో, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ప్రయత్నించే పాత్రికేయులకు తిప్పలు తప్పవు. మార్చి 25 నుంచి మే 31 మధ్యలో, లాక్‌డౌన్‌ కాలంలో, విధినిర్వహణ చేస్తున్నందుకు, దేశవ్యాప్తంగా 55 మంది పాత్రికేయులపై ప్రభుత్వాలు రకరకాల వేధింపులకు పాల్పడ్డారని ఒక హక్కుల గ్రూపు లెక్కవేసింది. ఇక సోషల్‌ మీడియాలో అసమ్మతి స్వరాలపై పెడుతున్న కేసులకు లెక్కలేదు. 


న్యాయప్రక్రియ పద్ధతి ప్రకారం జరగాలని చెప్పడం సబబే. కానీ, పద్ధతి కంటె న్యాయం ముఖ్యమని న్యాయమూర్తులకు తెలియనిది కాదు. ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో ఉపా కేసులో అరెస్టయినవారు బయటపడడం అసాధ్యమని పత్రికలు చదివేవారందరికీ తెలుసును. డాక్టర్‌ కఫిల్‌ఖాన్‌ విషయంలో ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించిందో తెలిసిందే. ఒక్క ఉత్తరప్రదేశ్‌ అనే కాదు, తీవ్రమైన చట్టాలను, సాధారణ చట్టాలను కూడా అతి చాకచక్యంగా, అమానవీయంగా ఉపయోగిస్తున్న సందర్భాలు తరచు వింటున్నాము. న్యాయం జరిగినా జరగకపోయినా, ఈ ఉదంతాలన్నీ న్యాయస్థానాల ముంగిటికి అయితే వెడుతున్నాయి. విధినిర్వహణలో భాగంగా ఒక అత్యాచారం జరిగిన చోటికి వెడుతున్న పాత్రికేయుడిని ఉపా చట్టం కింద అరెస్టు చేయడం హేయం, దుర్మార్గం. ఇది ఒక వ్యక్తి హక్కులకు సంబంధించిన విషయం కాదు. ప్రజల సమాచార హక్కు, సమాచార సాధనాల ప్రజాస్వామిక హక్కు అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. 


ప్రజల ఓట్లతో గెలిచాము, రాజ్యాంగాన్ని, చట్టాన్ని లెక్కచేయకున్నా పరవాలేదు అనుకునే పాలనలో ఉన్నాము. కోర్టులు చేసే తీవ్ర వ్యాఖ్యలు ప్రజాభిమానాన్ని తగ్గించలేవని వారికి గట్టి నమ్మకం. అందుకే నిరంకుశ సరళి పెరిగిపోతున్నది. కోర్టులను కూడా బెదిరించే పాలకరాజకీయం నడుస్తున్నది. తన సంకోచాలను, క్రియారాహిత్యాన్ని న్యాయవ్యవస్థ కూడా వదులుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చొరవ తీసుకోవాలి.

Advertisement
Advertisement
Advertisement