ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలి

ABN , First Publish Date - 2021-12-01T05:39:42+05:30 IST

ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ కోరారు. చక్కెర కర్మాగారాల పరిస్థితులను తెలుసుకునేందుకు తాండవ షుగర్‌ ఫ్యాక్టరీకి మంగళవారం ఆయన విచ్చేశారు.

ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలి
లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న నాయకులు, రైతులు, కార్మికులు

  సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ
 తుని, నవంబరు 30: ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ కోరారు. చక్కెర కర్మాగారాల పరిస్థితులను తెలుసుకునేందుకు తాండవ షుగర్‌ ఫ్యాక్టరీకి మంగళవారం ఆయన విచ్చేశారు. విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతులు ఎక్కడైతే కష్టాల్లో ఉంటారో అక్కడ అభివృద్ధి ఉండదన్నారు. రైతుల కంట కన్నీళ్లు వచ్చేలా పాలకుల నిర్ణయాలు ఉండకూడదన్నారు. తాండవ షుగర్స్‌కు ప్రభుత్వం కేవలం రూ.20 కోట్లు కేటాయిస్తే రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించవచ్చన్నారు. మరమ్మతులకు రూ.1.50 కోట్ల నిధులు కేటాయిస్తే ఫ్యాక్టరీని యఽథావిధిగా నడపవచ్చని కార్మికులే చెప్తున్నారన్నారు.  32 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా ఫ్యాక్టరీ మూతపడకుండా ఉండాలంటే ప్రభుత్వం మరమ్మతులకు నిధులు కేటాయిస్తే తామంతా కష్టపడి పనిచేస్తామని కార్మికులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఫ్యాక్టరీలు మూతపడితే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తామని ప్రశ్నించారు. చక్కెర కర్మాగారాలను మూసివేయడం సమస్యకు పరిష్కారం కాదని, వాటి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. సమావేశానికి ఇంటెలిజెన్స్‌ పోలీసులు వచ్చే ఉంటారని, ఈ సమావేశంలో చర్చించిన సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, కార్మికులతో చర్చించిన సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. సీపీఐ నాయకుడు నరసింహారావు, లోక్‌సత్తా పార్టీ నాయకుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ 70 ఏళ్లుగా నడుస్తున్న ఫ్యాక్టరీని మూసివేసి ఆ భూములను కాజేయాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారన్నారు. పోరాటం చేయాల్సి వస్తే తాము ముందుండి మొదటి దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ సుర్ల లోవరాజు, తోట నగేష్‌ ప్రసంగించారు. అనంతరం లక్ష్మీనారాయణకు శాలువా కప్పి సన్మానించారు. పెదిరెడ్డి చిట్టిబాబు, జగతా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:39:42+05:30 IST