దుర్గమ్మ రథం విగ్రహాల అపహరణలో కీలక విషయాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2020-09-19T22:49:51+05:30 IST

దుర్గమ్మ రథం విగ్రహాల అపహరణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. కరోనా కారణంగా విధించిన...

దుర్గమ్మ రథం విగ్రహాల అపహరణలో కీలక విషయాలు వెలుగులోకి..!

విజయవాడ: దుర్గమ్మ రథం విగ్రహాల అపహరణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలోనే వెండి ప్రతిమలు చోరీ అయినట్లు తేలింది. ఉగాది ఉత్సవాల సందర్భంగా రథం సిద్ధం చేయాలని మార్చి 11న దుర్గగుడి ఈవో సురేష్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. సర్క్యులర్‌లో స్పష్టంగా మార్చి 25న వెండి రథం ఊరేగింపుపై ప్రస్తావన ఉండటం గమనార్హం. రథం ఊరేగింపు సందర్భంగా మరమ్మతులు, పాలిష్‌ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇంజినీరింగ్‌ విభాగం, పాలిష్‌, అప్రైజర్‌ నుంచి వివరాలు సేకరించారు. పాలిష్‌ పెట్టే సమయంలో వెండి సింహపు ప్రతిమలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది.


దుర్గగుడిలో అమ్మవారికి చెందిన బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను ప్రతినెలా పాలిష్‌ పెడతారు. ఈ కాంట్రాక్టును శార్వాణీ ఇండస్ట్రీకి అప్పగించారు. పాలిష్‌ పెట్టినందుకుగాను ఆ సంస్థకు నెలకు రూ.47వేలు దుర్గగుడి అధికారులు చెల్లిస్తున్నారు. పాలిష్‌ పెట్టే పనిని శార్వాణీ ఇండస్ట్రీస్‌ వెంకట్‌ అనే వ్యక్తికి అప్పగించింది. ఈ ఏడాది మార్చిలో చివరిసారిగా రథానికి పాలిష్‌ పెట్టినట్లు, ఆ సమయంలో రథానికి నాలుగు సింహాలు ఉన్నట్లు వెంకట్‌, అప్రయిజర్‌ షమి పోలీసుల విచారణలో అంగీకరించారు. మార్చి తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా నెలనెలా జరిగే పాలిష్‌ పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చి, రథాన్ని చాలాకాలంగా పరిశీలించలేదన్నట్లు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2020-09-19T22:49:51+05:30 IST