అప్పర్‌ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా?

ABN , First Publish Date - 2021-08-03T16:42:18+05:30 IST

రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టులలో అప్పర్‌ భద్రా ఒకటి. అప్పర్‌ భద్ర పథకానికి జాతీయ హోదా ఇవ్వాలంటూ కొద్దికాలంగా రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగా ఎం

అప్పర్‌ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా?

- ప్రధానికి రాష్ట్ర ఎంపీల వినతి 

- బయలుసీమ జిల్లాలకు తీరనున్న తాగునీటి సమస్య


బెంగళూరు: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టులలో అప్పర్‌ భద్రా ఒకటి. అప్పర్‌ భద్ర పథకానికి జాతీయ హోదా ఇవ్వాలంటూ కొద్దికాలంగా రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీల బృందం సోమవారం ప్రధాని నరేంద్రమోదీని ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అప్పర్‌భద్రాకు జాతీయ హోదా ఇవ్వాలని ఐదు దశాబ్దాలుగా విజ్ఞప్తులు చేస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం చేయాలని కో రారు. ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉండడంతో ప్రస్తుతం అప్పర్‌ భద్రా ప్రాజెక్టు పనులు నత్తనడకన సా గుతున్నాయి. జాతీయ హోదా లభిస్తే ప్రాజెక్టు పనులు శరవేగం అవుతాయని, కనీసం పదేళ్ల అవధిలోనైనా సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని గంపెడంత ఆశతో ఉన్నారు. ప్రత్యేకించి చిత్రదుర్గ, దావణగెరె, చిక్కమగళూరు జిల్లాల ప్రజలకు అప్పర్‌భద్ర ప్రాజెక్టు కీలకంగా ఉంది. 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టు లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. 2 లక్షల హెక్టార్లు బిందు సేద్యం పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం కాలువ పనులు కేవలం 10 శాతం మాత్రమే పూర్తయ్యాయి. పనులు ఇదే రకంగా సాగితే శిరా, చిక్కనాయకనహళ్ళి తదితర ప్రాంతాలకు నీరు దక్కాలంటే పదేళ్ల సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. తుమకూరు జిల్లా నుంచి 120 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించాల్సి ఉంది. ఇందుకు దాదాపు 2,420 ఎకరాల భూమి అవసరం కానుంది. ఇంత వరకు 540 ఎకరాల భూమిని మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. కొన్నిచోట్ల తమ భూములను ఇచ్చేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. నష్టపరిహారం విషయంలో పేచీలు సాగుతున్నాయి. 


భద్రా పథకం ఏమిటంటే...

భద్రా రిజర్వాయర్ నుంచి బయలుసీమ జిల్లాలకు నీటిపారుదల సదుపాయం కల్పించడమే ఈ పథకం ఉద్దేశ్యం. తుంగ రిజర్వాయర్‌ నుంచి నీటిని తరికెరె తాలూకా లక్కవళ్లి సమీపంలోని భద్ర రిజర్వాయర్‌కు వదులుతున్నారు. అక్కడి నుంచి కాలువల ద్వారా చిత్రదుర్గ, చిక్కమగళూరు, తుమకూరు, దావణగెరె జిల్లాలకు సాగునీటి సదుపాయం కల్పించాలన్నది లక్ష్యం. ఇంత వరకు ఈ పథకం కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. పదే పదే టెండర్లు పిలుస్తున్నా కార్యాచరణ అంతంతమాత్రంగా ఉంటోంది. నిజలింగప్ప ముఖ్యమంత్రిగా సేవలందించినప్పటి నుంచి ఈ పథకం కొనసాగుతూనే ఉందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. నీటిపారుదల నిపుణుడు కేసీ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయన సమితి అప్పర్‌ భద్రా పథకానికి 2008లో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 29.9 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులవైపు తరలించడమే లక్ష్యంగా ఉంది. నాలుగు జిల్లాల్లో 367 చెరువులు ఉన్నాయి. 50 శాతం మేర అయినా చెరువులు నింపగలిగితే 5.57 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం దక్కనుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.12,340 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ఈ పథకం రూపురేఖల ప్రకారం తుంగ రిజర్వాయర్‌ నుంచి జూన్‌ నుంచి అక్టోబరు వరకు 17.4 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసి భద్ర రిజర్వాయర్‌లోకి వదులుతారు. భద్రా రిజర్వాయర్‌లోని 12.5 టీఎంసీల నీటిని కలిపి ఎగువభద్ర ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు. భద్ర రిజర్వాయర్‌ నుంచి కాలువలలోకి నీరు వదిలేందుకు 11 కిలోమీటర్ల దూరంలోని తరికెరె తాలూకా శాంతిపుర, 46కిలో మీటర్ల దూరంలోని బెట్టద తావరకెరె ప్రాంతాలలో పంప్‌హౌ్‌సలు నిర్మించారు. రెండుచోట్ల 45 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌ చేసి కాలువలకు వదులుతున్నారు. ఇందు కో సం శక్తివంతమైన 4 మోటర్లు అమర్చారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న అప్పర్‌ భద్ర కోసం 7కిలోమీటర్ల మేర సొరంగమార్గం నిర్మించారు. హేమావతి కాలువ తర్వాత అతిపెద్ద సొరంగమార్గం అప్పర్‌ భద్రాలోనే చోటు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం అప్పర్‌ భద్ర ప్రాజెక్టులలో మొత్తమ్మీద 16 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించి కేంద్రం నుంచి విరివిగా గ్రాంట్లు మంజూరైతే మూడేళ్లలోనే అప్పర్‌భద్ర కల పరిపూర్ణం కావడం ఖాయమని నిపుణులు అంటున్నారు.


Updated Date - 2021-08-03T16:42:18+05:30 IST