ప్రభుత్వోద్యోగం.. అందులోనూ పోలీస్ కానిస్టేబుల్.. అయినా ఆ జాబ్‌కు ఈమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే..

ABN , First Publish Date - 2021-09-04T02:09:07+05:30 IST

తుపాకీతో షార్ట్ వీడియో చేసి..నెగెటివ్ కామెంట్స్ రావడంతో..ఓ మహిళా కానిస్టేబుల్ ఏం చేశారంటే..

ప్రభుత్వోద్యోగం.. అందులోనూ పోలీస్ కానిస్టేబుల్.. అయినా ఆ జాబ్‌కు ఈమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె పోలీసు యూనిఫాం ధరించారు.. చేతిలోనేమో తుపాకీ.. వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతోంది.. దానికి తగ్గట్టు ఓ వైరల్ డైలాగ్.. "పంజాబ్, హరియాణాలు ఊరికేనే అపఖ్యాతి పాలవుతున్నాయి గానీ.. ఒక్కసారి మా ఉత్తరప్రదేశ్ వచ్చి చూడు..అప్పుడు తెలుస్తుంది" అంటూ ఏదో పాపులర్ డైలాగ్.. దీనికి అనుగుణంగా ఆమె పెదాలు కదుపుతూ.. చేతిలో తుపాకీతో ఓ చిన్న షార్ట్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాధారణంగా ఇటువంటి వీడియోలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు! కానీ ఈ వీడియో పోస్ట్ చేసినది ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్! పేరు ప్రియాంకా మిశ్రా. ఆగ్రాలోని ఎమ్ఎమ్ గేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.  


అయితే..ఈ వీడియోను చూసిన నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.  ఆమె తీరును తూర్పారబట్టారు. ఓ పోలీసు అయి ఉండీ ఇలా చేస్తారా అంటూ తలంటేశారు! సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా నెగెటివ్ కామెంట్స్ వచ్చిపడ్డాయి! మరోవైపు..శాఖాపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. పైఅధికారులు ఆమెను విధులకు దూరంగా ఉంచారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయిన ప్రియాంక చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. రాజీనామా చేస్తున్నట్టు అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.


వీడియో వైరల్ అవడంతో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఆమెకు విపరీతంగా ఫాలోవర్లు పెరిగిపోయినప్పటికీ వృత్తి జీవితంలో మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. ఇలా వీడియోలు చేయకూడదన్న విషయం తనకు తెలియదని ప్రియాంక తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తప్పు తెలిసిన వెంటనే వీడియోలను డిలీట్ చేశానన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఆమె బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. కాగా.. ప్రియాంక రాజీనామా లేఖపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.  

Updated Date - 2021-09-04T02:09:07+05:30 IST