తలకిందులైన రాజకీయం

ABN , First Publish Date - 2021-09-30T06:45:51+05:30 IST

పంజాబ్‌ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్దూ కారణంగా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కొత్త ఆట ఆరంభించారు....

తలకిందులైన రాజకీయం

పంజాబ్‌ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్దూ కారణంగా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కొత్త ఆట ఆరంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగిన భేటీలో ఆయన బీజేపీలో చేరికకు దరఖాస్తుపెట్టుకున్నారనీ, కేంద్రమంత్రివర్గంలోకి ఆయనను తీసుకోబోతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాజీవ్‌గాంధీ ఆప్తమిత్రుడిగా రాజకీయాల్లోకి వచ్చి, దశాబ్దాలపాటు అధికారాన్ని అనుభవించి, ఆయన కుమారుడి కారణంగా పదవి పోగొట్టుకున్న అమరీందర్‌ సింగ్‌కు ఈ ఎనభైయేళ్ళ వయసులో ఇంకా ఎందుకీ పదవీవ్యామోహం అంటున్నారు మరికొందరు. అమరీందర్‌ ఏం చేయబోతున్నారన్నది అటుంచితే, రాజకీయాన్ని కూడా క్రికెట్‌ ఆటలాగే చూసిన సిద్దూ అజాగ్రత్తగా ఆడాడనీ, ఆయన ఇక ఔట్‌ కాక తప్పదని కొందరి విశ్లేషణ.


సిద్దూ చపలచిత్తుడని ఎప్పుడో చెప్పాను అన్న అమరీందర్‌ వ్యాఖ్య నేరుగా రాహుల్‌, ప్రియాంకలకే తగులుతుంది. అమరీందర్‌ వంటి ఓ బలమైన నాయకుడిని దీర్ఘకాలం వెంటాడి వేటాడి చివరకు విజయవంతంగా ఇంటికి పంపించివేయగలిగాడు సిద్దూ. కానీ, పేరు ఏదైతేనేమి, పట్టుమని పదిరోజుల్లో తాను కూడా అదే దారిలో నడిచాడు. అమరీందర్‌ను గద్దెదించడమన్న లక్ష్యాన్నే సాధించగలిగినవాడు, కాస్తంత ఓపికగా, తెలివిగా వ్యవహరిస్తే కోరుకున్నవి నెరవేర్చుకోగలిగేవాడేమో. ఆయన రాజీనామాను ఆమోదించలేదని కాంగ్రెస్‌ అంటున్నది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాననీ, సమస్య కచ్చితంగా పరిష్కారం అవుతుందని కొత్త ముఖ్యమంత్రి మర్యాద మాటలు మాట్లాడుతున్నారు. కానీ, అతికొద్ది నెలల్లో ఎన్నికలకు పోబోతున్న రాష్ట్రంలో పార్టీనీ, దాని పరువుప్రతిష్ఠలను పదిలంగా కాపాడాల్సిన ఓ పెద్దమనిషి దాని భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టేశాడు.


ప్రాణాలైనా వదిలేస్తాను కానీ విలువల్లో రాజీపడేది లేదనీ, సిద్దూను ఎవరూ లొంగదీయలేరని ఆయన ఓ విడియో కూడా విడుదలచేశాడు. మంత్రివర్గంలోనూ, పోలీసు బాసువంటి కీలకమైన పోస్టుల్లోనూ తనకు గిట్టనివారిని తెచ్చికూచోబెట్టినందుకు కోపం ఉండివుండవచ్చు. తన వాదనకు సమర్థనగా ఆరేళ్ళక్రితం గురుగ్రంథ్‌సాహెబ్‌కు అవమానం జరిగిన ఘటనపై దర్యాప్తు నీరుకారిన అంశాన్ని కూడా ఆయన గుర్తుచేస్తున్నారు. అవన్నీ నిజమే కావచ్చును కానీ, తానొక్కడే నిజాయితీపరుడు అయినట్టూ, కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం అవినీతిపరులతో నిండిపోయినట్టూ ముద్రవేయడం సరికాదు. ఎక్కువమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించిన రెండుమూడుపేర్లను సైతం సిద్దూ కాదనడంవల్లనే ప్రియాంకాగాంధీ పక్కనబెట్టారనీ, చివరకు చన్నీ విషయంలో ఆయన అయిష్టంగానే ఊ కొట్టాల్సి వచ్చిందని అంటారు. ముప్పైశాతం దళిత ఓటుబ్యాంకు ఉన్న పంజాబ్‌కు ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా కాంగ్రెస్‌ ఒకే దెబ్బతో అకాలీలనూ, ఆమ్‌ ఆద్మీనీ చిత్తుచేసిందని అందరూ అనుకున్నారు. ఆ తరువాత సిద్దూ వర్గీయులు అదేపనిగా తమ నాయకుడే సూపర్‌ సీఎం అంటూ వ్యాఖ్యానించడం, ఎన్నికల్లో పార్టీని నెగ్గించే మొఖం ఆయనదేననడం, గద్దెమీద దళితముఖ్యమంత్రిని కూచోబెట్టి పాలన మాత్రం అగ్రకులాలు చేస్తాయా అని కొందరు ప్రశ్నించడం, చన్నీ, సిద్దూ ఇద్దరూ పార్టీకి రెండుకళ్ళని అధిష్ఠానం సర్దిచెప్పడం తెలిసిందే. 


అమరీందర్‌ వంటి ఓ పెద్దతలకాయను వదులుకున్నా, దళిత్‌ సిఎం దెబ్బతో కాంగ్రెస్‌కు ఈ మారు విజయం ఖాయమని అందరూ లెక్కలేసుకుంటున్నదశలో ఈ మొత్తం కృషిని సిద్దూ రాజీనామాతో నీరుగార్చేశాడు. కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని తీవ్రంగా అవమానించాడు. ముఖ్యమంత్రి మారాడు తప్ప అదే అవినీతి వ్యవస్థ కొనసాగుతున్నదంటూ విపక్షాలకు ఓ దుడ్డుకర్ర అందించాడు. బీజేపీనుంచి నాలుగేళ్ళక్రితం కాంగ్రెస్‌లో చేరేముందు సిద్దూ మధ్యలో ఓ చిన్నదుకాణం తెరిచి, ఆ తరువాత ఆమ్‌ ఆద్మీపార్టీతోనూ సంప్రదింపులు జరిపాడు. సిద్దూతో వ్యవహారం కష్టమని గ్రహించిన కేజ్రీవాల్‌ నీభార్యకు టిక్కెట్టు ఇస్తాం, నువ్వు ప్రచారం చేయాలని ఓ మెలికపెట్టారు. దాంతో కాంగ్రెస్‌లోకి వచ్చి అమరీందర్‌కు పొగబెట్టి ఆ పదవిలో కూచోవాలని ఆశించాడు సిద్దూ. వృద్ధ అమరీందర్‌ను వదల్చుకుంటే తప్ప ఆప్‌ను ఆపలేమని ప్రియాంక నమ్మడంతో కథ ఇంతదాకా వచ్చింది. సిద్దూను ఇప్పుడు బుజ్జగించి దారికి తెచ్చినా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి పాలనలో అనుక్షణం ఆటంకాలే. ఒకవేళ దళిత చన్నీని తప్పించి సిద్దూను సీఎం చేస్తే కాంగ్రెస్‌ ఇక పంజాబ్‌ను మరిచిపోవడం ఉత్తమం. సిద్దూ నిష్క్రమణ పార్టీకి అనూహ్యంగా అందివచ్చిన అవకాశమనీ, తన పదవీకాంక్షతో పార్టీ రాజకీయభవిష్యత్తును దెబ్బతీసిన ఆయనను సత్వరం వదల్చుకోవడం ఉత్తమమని అనేకులు అంటున్నారు.

Updated Date - 2021-09-30T06:45:51+05:30 IST