ఇలా బాల్కనీలో దుస్తులు ఆరేసినందుకు 1.30 లక్షల రూపాయల జరిమానా.. ఈ కొత్త చట్టం కథేంటంటే..

ABN , First Publish Date - 2022-07-14T14:22:44+05:30 IST

కువైత్ (Kuwait) మునిసిపాలిటీ ప్రజా పరిశుభ్రత, వ్యర్థ రవాణాకు సంబంధించి తాజాగా కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది.

ఇలా బాల్కనీలో దుస్తులు ఆరేసినందుకు 1.30 లక్షల రూపాయల జరిమానా.. ఈ కొత్త చట్టం కథేంటంటే..

కువైత్ సిటీ: కువైత్ (Kuwait) మునిసిపాలిటీ ప్రజా పరిశుభ్రత, వ్యర్థ రవాణాకు సంబంధించి తాజాగా కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ ముసాయిదా ఆమోదం కోసం కౌన్సిల్ లీగల్, ఫైనాన్షియల్ కమిటీకి పంపించింది. ఇక ఈ కొత్త ముసాయిదాలో పబ్లిక్ పరిశుభ్రతపై కఠినమైన చర్యలు ఉన్నాయి. దీనిలో భాగంగా వీధులు కనిపించని విధంగా బాల్కనీల్లో బట్టలు లేదా ఇతర వస్తువులను వేలాడదీసే వారిపై 500 కువైటీ దీనార్ల (రూ.1.30లక్షలు) వరకు జరిమానా ఉంటుందని మునిసిపాలిటీ అధికారులు పేర్కొన్నారు. అలాగే కాలిబాటలు, వీధులు, కూడళ్లు, బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు, వాటర్ ఫ్రంట్‌లు, ప్రభుత్వ యాజమాన్యంలోని భూములలో బార్బెక్యూ(Barbecue)పై నిషేధం విధించింది. అంతేగాక బార్బెక్యూ ఎక్కడ అనుమతించబడుతుందో ప్రత్యేకంగా ముసాయిదాలో పేర్కొనబడింది. ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన వారికి కనిష్ఠంగా 2000 దీనార్లు(రూ.5.17లక్షలు) నుంచి గరిష్టంగా 5,000 దీనార్ల(రూ.12.94లక్షల) కంటే ఎక్కువ జరిమానా విధించడం జరుగుతుందని ముసాయిదాలో పేర్కొంది.


ఇదే కోవలో యూఏఈ రాజధాని అబుదాబి మున్సిపాలిటీ అధికారులు ఏప్రిల్‌లో అక్కడి నివాసితులకు ఓ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. బాల్కనీలో బట్టలు ఆరవేస్తే వెయ్యి దిర్హమ్స్(రూ.20వేలు) జరిమానా విధిస్తామని వెల్లడించారు. అలా బాల్కనీలో బట్టలు ఆరవేయడం వల్ల సిటీ అందం దెబ్బతింటుందనేది మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అందుకే లాండ్రీ డ్రైయింగ్, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే  ఆరవేసుకోవాలని చెప్పారు. ఒకవేళ తమ హెచ్చరికలను బేఖాతరు చేసి బాల్కనీలో బట్టలు ఆరవేస్తే మాత్రం రూ.20వేలు కట్టాల్సిందేనని అన్నారు. నేర తీవ్రతను బట్టి ఈ జరిమానా మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు తెలియజేశారు. అందుకే ఈ విషయంలో రెసిడెంట్స్ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నగరాన్ని అందంగా, పరిశుభ్రంగా ఉంచాలని పౌరులు, నివాసితులకు సూచించారు.   

Updated Date - 2022-07-14T14:22:44+05:30 IST