యురేనియం: అసెంబ్లీ తీర్మానం గెలుస్తుందా?

ABN , First Publish Date - 2020-05-22T05:34:56+05:30 IST

యురేనియం తవ్వకాలను అనుమతించబోమని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కెసిఆర్‌ చేసిన ప్రకటనకి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజాభిప్రాయాన్ని మన్నించిన సీఎంగా ప్రజలూ భావించారు...

యురేనియం: అసెంబ్లీ తీర్మానం గెలుస్తుందా?

యురేనియం తవ్వకాలను అనుమతించబోమని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కెసిఆర్‌ చేసిన ప్రకటనకి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజాభిప్రాయాన్ని మన్నించిన సీఎంగా ప్రజలూ భావించారు. ప్రస్తుతకాలంలో నల్లమలలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లు పడుతున్నాయి. తవ్విన నాలుగువేల బోరు బావుల వద్దకు పెద్దపెద్ద వాహనాలు వెళ్ళడానికే అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ, అటవీశాఖ అధికారులు మాత్రం వన్యజీవులకు నీళ్ళు అందించడానికే ఈ దారులు అని ఓ వింత విషయం చెబుతున్నారు. నల్లమల మీద విమానాలు తిరుగుతున్నాయి. ఏ శాఖాధికారిని అడిగినా జవాబు దాటేస్తున్నారు. పదిరోజుల క్రితం యురేనియం కార్పొరేషన్‌ అధికారులు, అటవీ అధికారులు కలసి ఆ ప్రాంతంలో పర్యటిస్తుంటే ప్రజలు అడ్డుకున్నారు. ఎప్పటిలాగానే పోలీసులు ప్రజల అడ్డు తొలగించారు, జెఎసి నాయకులను అరెస్టుచేశారు. అసలు, ఏం జరుగుతోందని తెలుసుకోవడంకోసం కలెక్టరుగారికి ఆర్టీఐ ద్వారా అర్జీ ఇస్తే అందుకు జిల్లా ముఖ్యాధికారి జవాబు చెప్పకుండా పరిశ్రమలశాఖ అధికారికి దానిని పంపించడం జరిగింది.


ఈ సందర్భంలో, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అటవీ సలహా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. నల్లమల అటవీప్రాంతంలో అన్వేషణకు అనుమతులు ఇచ్చే విషయానికి సంబంధించి స్పష్టమైన సిఫారసులు పంపాలని సూచించింది. ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటిఆర్‌)లో యురేనియం నిలువలు ఎక్కడ, ఎంత శాతం ఉన్నాయన్న దానిపై సర్వే, తవ్వకాలు చేపట్టే విషయమై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయలని లేఖరాసింది. దీని ప్రకారం ఎటిఆర్‌ ప్రాంత పరిధిలో యురేనియం నిలువల వెలికితీత అన్వేషణ కోసం లోగడ కెసిఆర్‌ అధ్యక్షునిగా ఉన్న కమిటి ఆమోదించింది. అందులో అటవీ వృక్షాలకు, వన్యప్రాణులకు నష్టం కలగకూడదని, ఉన్న రోడ్లు, దారులు, కాలినడక మార్గాలనే ఉపయోగించాలని, కేవలం సర్వేమాత్రమే చేయాలని, యురేనియం నిలువలు వెలికితీయరాదని సూచించింది. కాని దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం తరువాత కూడా ఇలాంటి పనులు ఆగలేదు. 


గత ఏడాది సెప్టెంబరు 15వ తేదీనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ నల్లమలలోనే కాదు, రాష్ట్రంలో మరెక్కడా యురేనియం తవ్వకాలను అనుమతించే ప్రసక్తిలేదని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా తవ్వకాలకు అనుమతించేది లేదని చెప్పారు. అసెంబ్లీ తీర్మానం చేసి, కౌన్సిల్‌లో కూడా తీర్మానం చేస్తామన్నారు. కాని కౌన్సిల్‌లో మంత్రి కెటిఆర్‌ మాత్రం యురేనియం అవసరాన్ని నొక్కివక్కాణించడం చూసి ప్రజలు, మేధావులు ఆశ్చర్యపోయారు. అసెంబ్లీ తీర్మా నం ప్రజలకు ఊరట కలిగించినా, కేంద్రం తిరిగి అనుమతి కోసం లేఖ రాయడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఎంత వత్తిడి తెచ్చినా మేం అందుకు వ్యతిరేకంగా పోరాడుతాం తప్ప అనుమతులు ఇచ్చే ప్రసక్తిలేదని కరాఖండిగా చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం యురేనియం బంతి రాష్ట్రం మీద పడేసి ఏం చేస్తారో చూస్తాం అన్నట్లు కేంద్రప్రభుత్వం వైఖరి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ హామీ కొనసాగుతుందా, తీర్మానించిననాటి మాటలు తిరుగులేని విధంగా చెప్పబడుతాయా అన్నది ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాలని లోకం వేచిచూస్తోంది. ముఖ్యమంత్రిగారి చతురత, పాలనా దక్షతకి ఇది పరీక్షాకాలం. అందులో ఆయన నెగ్గాలి, ప్రజలను గెలిపించాలి. 

జయధీర్‌ తిరుమల రావు

Updated Date - 2020-05-22T05:34:56+05:30 IST