Abn logo
Oct 26 2021 @ 23:32PM

ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి

విలేకరులతో మాట్లాడుతున్న కమిషనర్‌ రంగస్వామి

ప్రతి డివిజన్‌లో రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు 

పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత 

కమిషనర్‌ రంగస్వామి

కడప(ఎర్రముక్కపల్లె), అక్టోబరు 26: నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని కమిషనర్‌ రంగస్వామి పేర్కొన్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి డివిజన్‌లో రూ.15 లక్షలతో డ్రైన్లు, రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నట్లు చెప్పారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థగా గుర్తించామని, యూజీడీ పనులు అసంపూర్తిగా ఉన్న కారణంగా ఈ సమస్య వచ్చిందన్నారు. పనులు పూర్తి చేసేందుకు మరో రూ.121 కోట్లు అవసరమని, దానికి సంబంధించి డీపీఆర్‌ రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసే లోపు మాచుపల్లి రోడ్డు నిర్మాణానికి మంజూరైన 69 కోట్లు నిధులు యూజీడీ పనులకు మళ్లించి స్ర్టామ్‌ వాటర్‌ డ్రైవింగ్‌ నిర్మాణ పనులు పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 2022 ఫిబ్రవరి నాటికి యూజీడీ పనులు పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే నగర ప్రజలు వ్యాక్సిన్‌పై అపోహలు విడనాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు నగరంలో 95 శాతం వ్యాక్సిన్‌ పూర్తి చేశామని, మిగతా ఐదుశాతం పూర్తి చేయాల్సి ఉందన్నారు. 


48వ డివిజన్‌లో పర్యటిస్తా

48వ డివిజన్‌లో డ్రైనేజీ కబ్జాకు గురైందని, చిన్నపాటి వర్షం వస్తే ఏఎన్‌ఆర్‌ నగర్‌, బుడగజంగం కాలనీ, లోహియానగర్‌ తదితర ప్రాంతాలు జలమయం అవుతున్నట్లు ప్రజల ద్వారా వినతులు వచ్చాయని, త్వరలో కబ్జాకు గురైన డ్రైనేజీని పరిశీలిస్తామన్నారు. తక్షణం దానిపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ సి.చరణ్‌తేజ్‌రెడ్డి, మేనేజర్‌ హిదయతుల్లా పాల్గొన్నారు.