అర్బన్‌ నక్సల్స్‌.. అభివృద్ధి నిరోధకులు!

ABN , First Publish Date - 2022-09-24T07:56:57+05:30 IST

అర్బన్‌ నక్సల్స్‌ అభివృద్ధి నిరోధకులని, పర్యావరణ పరిరక్షణ పేరిట అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.

అర్బన్‌ నక్సల్స్‌.. అభివృద్ధి నిరోధకులు!

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌, సెప్టెంబరు 23: అర్బన్‌ నక్సల్స్‌ అభివృద్ధి నిరోధకులని, పర్యావరణ పరిరక్షణ పేరిట అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. రాజకీయాల అండతో అర్బన్‌ నక్సల్స్‌  చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో శుక్రవారం ప్రారంభమైన రాష్ట్రాల పర్యావరణ మంత్రుల సదస్సును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా చెలరేగుతున్న అర్బన్‌ నక్సల్స్‌కి వివిధ సంస్థలు, పార్టీలు అండగా ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు. ఒక్కొక్కసారి న్యాయవ్యవస్థనూ.. ప్రపంచ బ్యాంకును సైతం ప్రభావితం చేస్తున్నారని మోదీ అన్నారు.  


ప్రాజెక్టులతో పర్యావరణానికి మేలు

వివిధ రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన 12500 దరఖాస్తులు పెండింగులో ఉండడాన్ని ప్రధాని తీవ్రంగా తప్పుబట్టారు. వీటిలో 6 వేల దరఖాస్తులు పర్యావరణ అనుమతుల కోసం, 6500 దరఖాస్తులు అటవీ అనుమతుల కోసం.. పెండింగులో ఉన్నాయని చెప్పారు. ఇలా పెండింగ్‌ పెట్టుకుంటూ పోతే.. ఆయా ప్రాజెక్టుల వ్యయం అపరిమితంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నిర్మించిన ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ను దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. దీనివల్ల 5 లక్షల లీటర్ల చమురు ఆదా చేయడంతోపాటు, 13000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించినట్టు అయిందన్నారు. ఫ్లైవోవర్లు, రహదారులు, రైల్వే ప్రాజెక్టులు కూడా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదపడతాయని తెలిపారు. కాగా, కేంద్రం తీసుకువచ్చిన తుక్కు వాహనాల ప్రాసెస్‌ విధానాన్ని రాష్ట్రాలు సత్వరమే వినియోగించుకోవాలని ప్రధాని కోరారు. 

Updated Date - 2022-09-24T07:56:57+05:30 IST