అర్బన్‌.. కొందరికే పెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-02T06:38:43+05:30 IST

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఒకటో తేదీన కొందరికే పింఛను అందింది. శనివారం రాత్రి 9 గంటలకైనా నగదు జమ కాకపోవడం.. ఆపై సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారు. ఆదివారం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గా.. పట్టణాల్లో కొందరికే పింఛను పంపిణీ చేశారు.

అర్బన్‌.. కొందరికే పెన్షన్‌

 తిరుపతిలో 10.53 శాతమే 

 సరిపడా డబ్బులు అందకపోవడమే కారణం 

నేడు పంపిణీ చేయనున్న అధికారులు 


  చిత్తూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఒకటో తేదీన కొందరికే పింఛను అందింది. శనివారం రాత్రి 9 గంటలకైనా నగదు జమ కాకపోవడం.. ఆపై సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారు. ఆదివారం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గా.. పట్టణాల్లో కొందరికే పింఛను పంపిణీ చేశారు. దీంతో ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. ప్రతి నెలా 1వ తేదీన 95 నుంచి 98 శాతం పింఛన్ల పంపిణీతో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉండేది. ఈసారి 77.82 శాతం పంపిణీతో రాష్ట్రంలో 8వ స్థానానికి దిగజారింది. జిల్లాలో ఆదివారం రాత్రికి 5,05,061 మందికిగాను 3,93,054 మందికి పింఛన్లు అందించారు. కాగా, పింఛన్ల నగదు కోసం ఆదివారం కూడా కొందరు సచివాలయ ఉద్యోగులు బ్యాంకుల వద్దకు వెళ్లి డబ్బులు రాకపోవడంతో వెనుదిరిగారు. పట్టణాల్లో పంపణీని చూస్తే.. పలమనేరులో 5.99 శాతం, తిరుపతిలో 10.53, నగరిలో 15.06, శ్రీకాళహస్తిలో 17.78, పుత్తూరులో 17.79, మదనపల్లెలో 36, చిత్తూరులో 37.01, పుంగనూరులో 53 శాతం చొప్పున పింఛన్లు పంపిణీ చేశారు. ఇక, సదుం మండలంలో 32.41, గుడుపల్లెలో 50.30, వాయల్పాడులో 61.69, వెదురుకుప్పంలో 72 శాతం చొప్పున పంపిణీ జరిగింది. వీటితో పాటు మరో 23 మండలాల్లో పంపిణీ 90శాతానికి లోపలే ఉంది.

పంపిణీ కానీ ప్రాంతాలెన్నో..

శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో 22 సచివాలయాలకుగానూ నాలుగు చోట్ల మాత్రమే పంపిణీ చేశారు. మిగతా 18 సచివాలయాల పరిధిలో పంపిణీ జరగలేదు. ఇదే పరిస్థితి నగర, పురపాలక సంస్థల పరిధిలోనూ ఎలకొంది. సదుం మండలంలో 11 గ్రామ సచివాలయాలకు గాను సదుం-2, తిమ్మానాయునిపల్లె, ఎర్రాతివారిపల్లె, చెరుకువారిపల్లె పరిధిలో మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు. వాల్మీకిపురం పంచాయతీలోనూ పంపిణీ చేయలేదు. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ కాస్త మెరుగ్గా జరిగినా.. పట్టణ ప్రాంతాల్లో చాలాచోట్ల 50 శాతం కూడా జరగలేదు.


పంపిణీ పూర్తి చేస్తాం 

పింఛన్ల పంపిణీకి మూడు రోజుల గడువు ఉంటుంది. ప్రతి నెలా తొలి రోజు పెద్దఎత్తున పంపిణీ చేసేవాళ్లం. ఈ సారి సాంకేతిక సమస్య కారణంగా డబ్బులు అందకపోవడంతో సకాలంలో పంపిణీ చేయలేకపోయాం. అయినా కూడా రాష్ట్రంలో మనం 8వ స్థానంలో ఉన్నాం. స్థానిక సిబ్బంది సోమవారం బ్యాంకుల్లో నగదు తీసుకుని పంపిణీ చేసేస్తారు.

- తులసి, డీఆర్‌డీఏ పీడీ

Updated Date - 2021-08-02T06:38:43+05:30 IST