Abn logo
Sep 27 2021 @ 23:49PM

ఆటోల్లోనే మద్యం... ప్రశ్నిస్తే బెదిరింపులు

నెహ్రూనగర్‌లో అర్బన ఎస్పీకి సమస్యలు వివరిస్తున్న మహిళలు

న్యూ గుంటూరు రైల్వేస్టేషన ప్రాంతంలో భయం భయం

అర్బన  ఎస్పీ పర్యటనలో స్థానికుల ఫిర్యాదు

గుంటూరు, సెప్టెంబరు 27: న్యూ గుంటూరు రైల్వేస్టేషన పరిసర ప్రాంతాల్లో తాము భయం భయంగా బతకాల్సి వస్తోందని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీస్‌స్టేషన్ల వారీగా మురికివాడలు, పేదవర్గాల ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తున్న అర్బన ఎస్పీ సోమవారం సాయంత్రం కొత్తపేట పోలీస్‌స్టేషన పరిధిలోని నెహ్రూనగర్‌, బుచ్చయ్యతోట, న్యూగుంటూరు రైల్వేస్టేషన తదితర ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నెహ్రూనగర్‌కు చెందిన ఓవృద్ధురాలు అర్బన ఎస్పీ చేతులు పట్టుకుని తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి ఖాళీచేయకుండా ఇబ్బందిపెడుతున్నాడని, మీరే మాకు దిక్కు అని కన్నీరు పెట్టుకుంది. స్పందించిన అర్బన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తక్షణం తగు చర్యలు తీసుకుని వృద్ధురాలికి న్యాయంచేయాలని ఈస్టు డీఎస్పీ సీతారామయ్యను ఆదేశించారు. ఇదిలావుంటే న్యూగుంటూరు రైల్వేస్టేషన ప్రాంతంలో యువకులు ఆటోల్లోనే మద్యం సేవిస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని స్థానికమహిళలు వాపోయారు. రైల్వేస్టేషన ప్లాట్‌ఫారాలపై కొంతమంది యువకులు గంజాయి, మద్యం సేవిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని, రాత్రి సమయాల్లో రైళ్లలో రాకపోకలు చేయాలంటే భయపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన అర్బన ఎస్పీ రైల్వేస్టేషన పక్కనే ఉన్న ఇంట్లో బీట్‌ పుస్తకం ఏర్పాటుచేయాలని, ప్రతిరోజు రాత్రి గస్తీ సమయంలో సిబ్బంది ఆ రిజిస్టర్‌లో సంతకం చేయాలని, రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డిని ఆదేశించారు.  ఈ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే డయల్‌ 100కుగానీ, కొత్తపేట పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు.