దేశం నెత్తిన మరో కొరత.. ఎరువుల కోసం అల్లాడిపోతున్న రైతులు

ABN , First Publish Date - 2021-10-15T02:50:57+05:30 IST

పట్టిపీడిస్తున్న బొగ్గు కొరత నుంచి దేశం బయటపడకముందే, చాలా రాష్ట్రాలు మరో కొరతను ఎదుర్కొంటున్నాయి.

దేశం నెత్తిన మరో కొరత.. ఎరువుల కోసం అల్లాడిపోతున్న రైతులు

న్యూఢిల్లీ: పట్టిపీడిస్తున్న బొగ్గు కొరత నుంచి దేశం బయటపడకముందే, చాలా రాష్ట్రాలు మరో కొరతను ఎదుర్కొంటున్నాయి. రైతులు రబీ సీజన్‌కు సిద్ధమవుతున్న వేళ యూరియా కొరత రైతులను కలరవపెడుతోంది. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటకే విద్యుత్ కోతలు మొదలయ్యాయి.


మున్ముందు ఇవి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దీనికి తోడు ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్ వంటి రాష్ట్రాలు ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నాయి. యూరియా కోసం కొందరు రైతులు రోడ్డెక్కి ధర్నాలకు కూడా దిగుతున్నారు. జాతీయ రహదారులను దిగ్బంధనం చేస్తున్నారు. 


రబీ సీజన్‌ కోసం కేంద్రం ఇటీవల రూ. 28,655 కోట్ల అదనపు సబ్సిడీ ప్రకటించింది. మంగళవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఫాస్ఫాటిక్, పొటాసిక్ ఎరువుల కోసం కొత్త పోషకాధారిత సబ్సిడీ రేట్లను ఆమోదించింది. ఫెర్టిలైజర్ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే తక్కువకు విక్రయిస్తాయి కాబట్టి సబ్సిడీని ఆయా కంపెనీలకు చెల్లిస్తారు. అయితే, ఇప్పుడు మార్కెట్లో అతి ముఖ్యమైన నత్రజని ఎరువు అయిన యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. 


యూరియా కొరతను పరిష్కరించాలంటూ మధ్యప్రదేశ్‌లోని భిండ్ రైతులు గతవారం రెండుసార్లు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మొరేనాలో రైతులను నియంత్రించేందుకు పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. అలాగే, షియోపూర్‌లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. అయితే, అధికారులు మాత్రం యూరియా కొరత లేదని చెబుతున్నారు. 5 వేల టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. రైతులు ఆందోళన చెందొద్దని, పుకార్లు నమ్మవద్దని, ఇదంతా కాంగ్రెస్ కుట్రేనని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. 


ఇలాంటి పరిస్థితులే రాజస్థాన్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ నెలకొన్నాయి. రాష్ట్రానికి సరిపడా యూరియా నిల్వలు పంపాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. కాగా, రాజస్థాన్‌లోనూ పలు ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం రోడ్లెక్కి నిరసనలకు దిగారు.


మణిపూర్‌లో ఇంకా సగం మంది రైతులకు సరిపడా ఎరువులు అందలేదు. ప్రభుత్వం మాత్రం ఎరువుల కొరత లేదని చెబుతోంది. ఈ నెల 8న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రానికి 42 టన్నుల నాన్ యూరియా ఫెర్టిలైజర్స్ పంపిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. 

Updated Date - 2021-10-15T02:50:57+05:30 IST