దండం పెడతా.. ఎన్నికల షెడ్యూల్ కుదించండి..: మమత

ABN , First Publish Date - 2021-04-19T21:31:02+05:30 IST

పశ్చిమ బెంగాల్లో మిగతా మూడు దశల పోలింగ్‌ను ఒకే రోజు నిర్వహించాలంటూ ఇటీవల ఈసీని కోరిన సీఎం, తృణమూల్ ...

దండం పెడతా.. ఎన్నికల షెడ్యూల్ కుదించండి..: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మిగతా మూడు దశల పోలింగ్‌ను ఒకే రోజు నిర్వహించాలంటూ ఇటీవల ఈసీని కోరిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. గతంలో వెలువరించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఈసీ పునఃసమీక్షించుకోవాలని మమత విజ్ఞప్తి చేశారు. చివరి మూడు దశల ఎన్నికలను ఒకటి లేదా రెండు రోజులకు కుదించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి మరింత వ్యాపించకుండా నిలువరించవచ్చునని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర దీనజ్‌పూర్‌లో ఇవాళ జరిగిన ఓ ర్యాలీలో మమత ప్రసంగిస్తూ... ‘‘చేతులు జోడించి వేడుకుంటున్నా.. మిగతా మూడు దశల ఎన్నికలను ఈసీ ఒకే దశలో నిర్వహించాలి. ఒకే రోజు కుదరకపోతే రెండు రోజుల్లో పోలింగ్ పూర్తి చేయండి. ఒక రోజైనా ఆదా చేయండి. బీజేపీ నేతలు చెప్పినట్టు మీరు నిర్ణయాలు తీసుకోకండి. పోలింగ్ షెడ్యూల్‌ని కనీసం ఒక్కరోజైనా కుదించడం వల్ల మీరు ప్రజల ఆరోగ్యాలను కాపాడిన వాళ్లవుతారు...’’ అని పేర్కొన్నారు. తాను గానీ, టీఎంసీ పార్టీకి చెందిన ఇతర నేతలు గానీ తమ తమ ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు నిర్వహించబోమని కూడా ఆమె స్పష్టం చేశారు. కాగా గడచిన ఆరు నెలల్లో మోదీ ప్రభుత్వం కరోనా వైరస్‌ను నిలువరించడంలో ‘‘దారుణంగా విఫలమైందని’’ ఆమె ఆరోపించారు.

Updated Date - 2021-04-19T21:31:02+05:30 IST