ఊరినే ఆన్‌లైన్‌..ఆపై లోన్‌

ABN , First Publish Date - 2022-01-21T05:26:41+05:30 IST

వాగులు, వంకలు, భూములే కాదు వైసీపీ పాలనలో ఏకంగా ఊరులనే ఆ పార్టీ నేతలు అక్రమంగా ఆన్‌లైను చేయించుకుంటున్నారు. గ్రామాలను ఆన్‌లైన్‌ చేయడం నేరమని ఉన్నతాధికారులు ఒకవైపు చెప్తున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. నిబంధనలను తుంగలోకి తొక్కి ఏకంగా ఊరిని కూడా అధికారులపై ఒత్తిడి చేసి ఆన్‌లైన్‌ చేయించుకున్న ఘటన పుల్లలచెరువు మండలంలో వెలుగుచూసింది.

ఊరినే ఆన్‌లైన్‌..ఆపై లోన్‌
సిద్దెనపాలెం గ్రామం వ్యూ , (ఇన్‌సెట్లో) డీటీ కిరణ్‌కు ఫిర్యాదు చేస్తున్న సిద్దెనపాలెం మహిళలు

 వైసీపీ యూత్‌ కన్వీనర్‌పై

డీటీకి ఫిర్యాదు చేసిన సిద్దెనపాలెం మహిళలు

పీడీసీసీ బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు

పుల్లలచెరువు, జనవరి 20 : వాగులు, వంకలు, భూములే కాదు వైసీపీ పాలనలో ఏకంగా ఊరులనే ఆ పార్టీ నేతలు అక్రమంగా ఆన్‌లైను చేయించుకుంటున్నారు. గ్రామాలను ఆన్‌లైన్‌ చేయడం నేరమని ఉన్నతాధికారులు ఒకవైపు చెప్తున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. నిబంధనలను తుంగలోకి తొక్కి ఏకంగా ఊరిని కూడా అధికారులపై ఒత్తిడి చేసి ఆన్‌లైన్‌ చేయించుకున్న ఘటన పుల్లలచెరువు మండలంలో వెలుగుచూసింది. మండలంలోని సిద్దెనపాలెం గ్రామాన్ని మండల వైసీపీ నేత అక్రమంగా ఆన్‌లైన్‌ చేయించుకొని దర్జాగా బ్యాంక్‌లో పెట్టి రుణం పొందాడు. విషయం తెలియడంతో గురువారం గ్రామానికి చెందిన మహిళలు తమ ఊరును వైసీపీ నేత అక్రమంగా ఆన్‌లైను చేసుకొని బ్యాంక్‌లో రుణం పొందాడని పూర్తి విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోవాలని డీటీ కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. సిద్దెనపాలెం గ్రామానికే చెందిన మండల వైసీపీ యూత్‌ కన్వీనర్‌ గడ్డం సుబ్బయ్య, అదే గ్రామానికి చెందిన కొల్లి వీరబ్రహ్మయ్య అనేవారు ఈ వ్యవహారం చేశారు. ఐటీవరం రెవెన్యూ పరిధిలోని సిద్దెనపాలెం గ్రామం సర్వే నెంబరు 296ను ఖాతా 768, 1674లతో 8.32సెంట్లకు తమ పేరున పాసుబుక్‌ తెచ్చుకోవడమే కాకుండా ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత ముటుకుల సొసైటీ పరిధిలోని వైపాలెం పీడీసీసీ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణాలు పొందారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఆన్‌లైన్‌ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ఊరును ఆన్‌లైన్‌ నుంచి తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ వివరణ ఇస్తూ.. తమ కార్యాలయానికి గ్రామస్థులు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. ఆన్‌లైన్‌ తన హయాంలో చేయలేదని తెలిపారు. ఆ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టి నివేదికను ఉన్నాతాధికారులకు అందజేస్తామని వివరించారు.

Updated Date - 2022-01-21T05:26:41+05:30 IST