బయోటెక్ కంపెనీకి 1.6 బిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రకటించిన అమెరికా

ABN , First Publish Date - 2020-07-08T03:43:49+05:30 IST

కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో ఉన్న నోవావాక్స్ అనే బయోటెక్ సంస్థకు అమెరికా

బయోటెక్ కంపెనీకి 1.6 బిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రకటించిన అమెరికా

వాషింగ్టన్: కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో ఉన్న నోవావాక్స్ అనే బయోటెక్ సంస్థకు అమెరికా ప్రభుత్వం 1.6 బిలియన్ డాలర్ల(రూ. 11,983 కోట్లు) ఫండ్‌ను ప్రకటించింది. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ కింద ఈ ఫండ్‌ను ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(హెచ్‌హెచ్‌ఎస్), డిపార్ట్ ‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌తో చేసుకున్న అంగీకారం ప్రకారం నోవావాక్స్ సంస్థ ఈ ఏడాది చివరకు 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను డెలివరీ చేసేందుకు అంగీకరించింది. ఆపరేషన్ వార్ప్ స్పీడ్‌లో తాము భాగమైనందుకు ఆనందంగా ఉందని నోవావాక్స్ సీఈఓ స్టాన్లే ఎర్క్ తెలిపారు. కాగా.. ఈ సంస్థ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌పై రెండు దశల్లో ప్రయోగాలు చేసింది. మూడో దశ ప్రయోగం సెప్టెంబర్‌లో మొదలుపెట్టనుంది. ఈ సంస్థతో పాటు ప్రయోగాత్మక కొవిడ్-19 చికిత్సలో ఉన్న రీజెనరాన్ అనే మరో సంస్థకు కూడా 450 మిలియన్ డాలర్ల(రూ. 3,370 కోట్లు)ను ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆపరేషన్ వార్ప్ స్పీడ్‌లో భాగంగా అమెరికా ప్రభుత్వం 2021 నాటికి కోట్లాది విజయవంతమైన వ్యాక్సిన్‌లను సిద్దం చేయాలని భావిస్తోంది. కాగా.. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 29,38,625 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 1,30,306 మంది మరణించారు.

Updated Date - 2020-07-08T03:43:49+05:30 IST