అమెరికా క్యాపిటల్ భవనం మూసివేత !

ABN , First Publish Date - 2021-04-03T13:47:36+05:30 IST

అమెరికా క్యాపిటల్ భవనం వద్ద శుక్రవారం కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి మరణించగా, కారు డ్రైవర్‌ను భద్రత సిబ్బంది కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా క్యాపిటల్ భవనాన్ని అధికారులు మూసివేశారు.

అమెరికా క్యాపిటల్ భవనం మూసివేత !

వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ భవనం వద్ద శుక్రవారం కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి మరణించగా, కారు డ్రైవర్‌ను భద్రత సిబ్బంది కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా క్యాపిటల్ భవనాన్ని అధికారులు మూసివేశారు. భవనం ప్రాంగణాన్ని దిగ్బంధించారు. శుక్రవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనానికి సమీపంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఉన్నట్లుండి ఓ కారు ఇద్దరు పోలీసులపైకి దూసుకువెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.


గాయపడిన ఇద్దరు పోలీసుతో పాటు అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలీసు అధికారి విలియమ్ ఎవన్స్‌తో పాటు కాల్పుల్లో గాయపడిన నిందితుడు కూడా మృతిచెందాడు. కాగా, ఈ ఘటన సమయంలో అమెరికా కాంగ్రెస్ సమావేశంలో లేదు. ఇక ఈ ఘటన నేపథ్యంలో క్యాపిటల్ భవనాన్ని మూసివేసిన అధికారులు.. భవన సముదాయం వద్ద భారీగా నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించారు. ప్రాంగణాన్ని దిగ్బంధించారు. 


పోలీస్ అధికారి ఎవన్స్‌ మృతి పట్ల అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అధికారికి సంతాపంగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఏప్రిల్​ 6 వరకు జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. అటు పోలీసు అధికారి మృతి పట్ల అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. ఎవన్స్​ మృతి పట్ల కమల సంతాపం తెలిపారు. క్యాపిటల్​ను రక్షించడానికి ఓ సాహసోపేతమైన పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారని ఉపాధ్యక్షురాలు అన్నారు. ఇదిలాఉంటే.. జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేసిన ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా ఐదుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత ఆ తరహా ఘటన ఇదేనని ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారులు పేర్కొన్నారు.  

Updated Date - 2021-04-03T13:47:36+05:30 IST