లక్షల కొద్దీ కరోనా కేసులున్నా.. అమెరికాకు కాస్త ఊరటనిచ్చే అంశం ఇదొక్కటే..!

ABN , First Publish Date - 2020-04-08T00:39:31+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అమెరికా వ్యాప్తంగా 3,68,449 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు 10,943 మంది మృతిచెందారు.

లక్షల కొద్దీ కరోనా కేసులున్నా.. అమెరికాకు కాస్త ఊరటనిచ్చే అంశం ఇదొక్కటే..!

న్యూయార్క్: అమెరికాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అమెరికా వ్యాప్తంగా 3,68,449 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు 10,943 మంది మృతిచెందారు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్లడమే తప్ప ఎక్కడా తగ్గుముఖం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో అమెరికా ప్రజలకు ఒకే ఒక్క అంశం కొంత ఊరటనిస్తోంది. అదేంటంటే.. అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో 18 కంటే తక్కువ వయసున్న వారు రెండు శాతం కంటే తక్కువగానే ఉన్నారు. తమ ప్రాణాలు పోయినా పర్లేదు.. పిల్లలు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో బతికితే చాలని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఈ వార్త వారికి కొంత ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. పిల్లల్లో రెండు శాతం కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయన్న విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. రెండు నెలల పాటు చేసిన స్టడీ ప్రకారం తమకు వచ్చిన రిపోర్ట్ ఇదేనని ప్రకటించింది. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కూడా పెద్ద వారితో పోల్చుకుంటే చిన్న పిల్లల్లో చాలా తక్కువగా నమోదవుతున్నట్టు రిపోర్ట్ చెబుతోంది. 


అయితే.. దీన్ని కారణంగా తీసుకుని పిల్లలపై అశ్రద్ధ చూపించవద్దని సీడీసీ ప్రజలను హెచ్చరించింది. తమ దగ్గర ఉంది కేవలం కొంత డేటానే అని గుర్తుచేసింది. 18 అంతకంటే తక్కువ వయసున్న చాలా మంది కరోనా బారిన పడిన విషయాన్ని, ముగ్గురు పిల్లలు చనిపోయిన అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. కాగా.. ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు సీడీసీ 1,49,082 కేసుల డేటాను అనలైజ్ చేసింది. ఇందులో 2,752(1.7 శాతం) కేసులు 18 కంటే తక్కువ వయసున్న వారివి కాగా 1,13,985 కేసులు 18 నుంచి 64 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారివిగా గుర్తించింది. 2,752 కేసుల్లో 15 శాతం పసిపిల్లల(ఏడాది కంటే తక్కువ వయసు కలిగిన వారు) కేసులుగా సీడీసీ గుర్తించింది. అదే విధంగా 1 నుంచి 4 ఏళ్లలోపు పిల్లల కేసులు 11 శాతం, 5 నుంచి 9 ఏళ్ల వయసున్న వారి కేసులు 15 శాతం, 10 నుంచి 14 వయసున్న వారివి 27 శాతంగా ఉన్నాయి. మూడోవంతు కేసులు 15 నుంచి 17 ఏళ్లలోపు వారివని సీడీసీ పేర్కొంది.  

Updated Date - 2020-04-08T00:39:31+05:30 IST