కారుపై Drone దాడి బాధిత కుటుంబాలకు పరిహారం

ABN , First Publish Date - 2021-10-16T15:57:37+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌‌లో ఆగస్టులో పొరపాటుగా

కారుపై Drone దాడి బాధిత కుటుంబాలకు పరిహారం

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌‌లో ఆగస్టులో పొరపాటుగా జరిగిన డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తామని అమెరికా డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. బాధితుల కుటుంబ సభ్యులను అమెరికాకు తరలించేందుకు డిఫెన్స్ డిపార్ట్‌మెంట్, స్టేట్ డిపార్ట్‌మెంట్ కలిసి పని చేస్తున్నాయని తెలిపింది. ఈ దాడిలో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. 


పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌‌లో ఆగస్టులో పొరపాటుగా జరిగిన డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. బాధితుల కుటుంబ సభ్యులను అమెరికాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రక్షణ శాఖ అండర్ సెక్రటరీ (పాలసీ) డాక్టర్ కోలిన్ కహ్ల్, నాన్ ప్రాఫిట్ గ్రూప్ న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఫౌండర్ డాక్టర్ స్టీవెన్ క్వోన్ మధ్య గురువారం జరిగిన చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లాయిడ్ ఆస్టిన్ ఇచ్చిన వాగ్దానాలను డాక్టర్ కహ్ల్ పునరుద్ఘాటించారన్నారు. అయితే నష్టపరిహారంగా ఎంత సొమ్ము చెల్లిస్తారో చెప్పలేదు. 


ఆగస్టు 29న అమెరికా హెల్‌ఫైర్ మిసైల్‌తో ఓ కారుపై దాడి చేశారు. ఈ దాడిలో జెమెరాయ్ అహ్మది కుటుంబ సభ్యులు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు బాలలు ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ మెరైన్ జనరల్ ఫ్రాంక్ మెక్‌కెంజీ స్పందిస్తూ, ఇది విషాదకరమైన పొరపాటు అని తెలిపారు. అమాయకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారన్నారు. 




Updated Date - 2021-10-16T15:57:37+05:30 IST