అమెరికాలో కరోనా కల్లోలం! ఒక్కరోజులో 50 వేల కొత్త కేసులు!

ABN , First Publish Date - 2020-07-02T16:32:08+05:30 IST

అమెరికాలో కరోనా కంబంధ హస్తాల్లో చిక్కుకుని అల్లాడుతోంది. అగ్రరాజ్యంలో కరోనా కాలుపెట్టిన తరువాతికాలంలో ఎన్నడూ చూడని రీతిలో బుధవారం ఒక్కరోజే ఏకంగా 50 వేల కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో కరోనా కల్లోలం! ఒక్కరోజులో 50 వేల కొత్త కేసులు!

వాషింగ్టన్: కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుని అమెరికా అల్లాడుతోంది. అగ్రరాజ్యంలో కరోనా కాలుపెట్టిన తరువాతికాలంలో ఎన్నడూ చూడని రీతిలో బుధవారం ఒక్కరోజే ఏకంగా 50 వేల కేసులు నమోదయ్యాయి. దినసరి కేసుల సంఖ్య లక్షకు చేరవచ్చంటూ అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ హెచ్చరికలకు అనుగుణంగానే అమెరికాను కరోనా కాటేస్తోంది. ఈ పోరులో అమెరికన్లందరూ ఏకమై, మాస్కుల ధరించడం వంటి నియమాలు పాటించకపోతే కరోనా విజృంభిస్తుందని ఇటీవలనే ఆంథోని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.


జూన్ నెలలో విలయం..

జూన్ నెల తొలి వారంలో అమెరికాలో సగటున రోజుకు 22 వేల కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత వ్యాధి తీవ్రత క్రమంగా పెరుగుతూ వచ్చింది. దేశంలోని అనేక ప్రాంతాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా అవతరించాయి. ఇక గత ఏడు రోజులుగా పరిస్థితి మరింత దిగజారింది. దినసరి కేసుల సగటు 40 వేలు దాటిపోయింది. తాజాగా 50 వేల మార్కును కూడా దాటిన కేసులతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అక్కడ సగానికి పైగా కేసులు..అరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా టెక్సస్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశంలోని 30 శాతం జనాభా ఈ రాష్ట్రాల్లో నివసిస్తుంటుంది. ఈ నాలుగుతో పాటూ మరో 10 రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య జూన్ నెలలో రెట్టింపైంది. 


వేడుకలూ కారణమే..

కేసుల సంఖ్య వేగంగా పెరగడం వేనుకు ఇటీవల జరిగిన బహిరంగ వేడుకుల కూడా ఓ కారణమని తెలుస్తోంది. మే నెలలో జరిగిన మెమోరియల్ డే వేడుకల వల్ల కరోనా విజృంభించిందని నిపుణులు చేబుతున్నారు. ఇక ఈ వారంలో అమెరికాలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపైనే నిపుణుల దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది. అమెరికన్లు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. బీచ్, పార్క్‌లలో విస్తృత స్థాయిలో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అసలే కరోనా పేట్రేగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ వేడుకలు ప్రజారోగ్యానికి ఎంతటి నష్టాన్ని తెస్తాయోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2020-07-02T16:32:08+05:30 IST