అగ్ర‌రాజ్యంలో భారీగా త‌గ్గిన‌ క‌రోనా మ‌ర‌ణాలు.. కార‌ణ‌మిదే

ABN , First Publish Date - 2021-05-13T16:51:45+05:30 IST

అగ్ర‌రాజ్యంలో అమెరికాలో క‌రోనా మ‌ర‌ణాలు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డం శుభప‌రిణామం. అయితే, ఇది కేవ‌లం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

అగ్ర‌రాజ్యంలో భారీగా త‌గ్గిన‌ క‌రోనా మ‌ర‌ణాలు.. కార‌ణ‌మిదే

అమెరికాలో 10 నెలల కనిష్ఠానికి కరోనా మరణాలు

వాషింగ్ట‌న్‌: అగ్ర‌రాజ్యంలో అమెరికాలో క‌రోనా మ‌ర‌ణాలు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డం శుభప‌రిణామం. అయితే, ఇది కేవ‌లం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఏకంగా 10 నెలల కనిష్ఠానికి క‌రోనా మ‌ర‌ణాలు తగ్గాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 45 శాతం మంది టీకా లబ్ధిదారులకు వ్యాక్సినేషన్ పూర్తైనట్లు తెలిపింది. బుధవారం కొత్తగా కేవ‌లం 600 మరణాలు మాత్ర‌మే నమోద‌య్యాయ‌ని, గతేడాది జులై తర్వాత ఇవే అతి తక్కువ రోజువారీ మరణాలని ఆరోగ్యశాఖ తెలియ‌జేసింది. అలాగే డైలీ పాజిటివ్‌ కేసుల సంఖ్య గతేడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారి 38 వేల దిగువకు తగ్గిందని వెల్ల‌డించింది.


ఇక జనవరి నుంచి అమెరికాలో సగటున రోజుకు 3,400 మందిని మ‌హ‌మ్మారి క‌బ‌ళిస్తోంది. అయితే, గత నెల నుంచి వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌టంతో మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని ఆరోగ్య‌శాఖ వివరించింది. జో బైడెన్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఊపందుకుంది. ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకుని మ‌రీ బైడెన్ టీకా కార్య‌క్ర‌మాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. దీంతో అతి త‌క్కువ కాలంలోనే దేశ‌ వ్యాప్తంగా సుమారు 45 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేయ‌గ‌లిగారు. 


వ్యాక్సినేషన్ వ‌ల్లే ఇది సాధ్య‌మైంది: జాన్ హోప్‌కిన్స్ యూనివ‌ర్శిటీ

అటు వ్యాక్సినేషన్ వల్లే అగ్రరాజ్యంలో క‌రోనా మరణాలు తగ్గ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని జాన్ హోప్‌కిన్స్ యూనివ‌ర్శిటీ వెల్ల‌డించింది. యూఎస్‌లో ఇప్ప‌టికే దాదాపు 45 శాతం మంది వ‌యోజ‌నులు రెండు మోతాదుల‌ టీకా తీసుకున్నారని, అలాగే 58 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్‌ పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని యూనివ‌ర్శిటీ నిపుణులు తెలిపారు. ఇదే ఇప్పుడు మంచి ఫ‌లితాల‌ను ఇస్తోంద‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక ఇటీవ‌ల‌ 12 నుంచి 15 ఏళ్ల వ‌య‌స్సు పిల్ల‌ల‌కు కూడా ఫైజర్ టీకా ఇచ్చేందుకు యూఎస్‌ ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్(ఎఫ్‌డీఏ) అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైతే.. త్వ‌ర‌లోనే స్కూళ్లు కూడా తెరిచేందుకు మార్గం సుగ‌మ‌మైన‌ట్లేన‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Updated Date - 2021-05-13T16:51:45+05:30 IST