భారత్‌కు అమెరికా చాలా సాయం చేస్తోంది: బైడెన్

ABN , First Publish Date - 2021-05-05T14:09:41+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారత్​కు అగ్రరాజ్యం అమెరికా చాలా సాయం చేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

భారత్‌కు అమెరికా చాలా సాయం చేస్తోంది: బైడెన్

వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారత్​కు అగ్రరాజ్యం అమెరికా చాలా సాయం చేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో యూఎస్ నుంచి భారత్ గణనీయమైన సహకారం పొందుతోందని బైడెన్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత్​కు కీలకమైన వైద్య పరికరాలు, మెడిసిన్స్, ఆక్సిజన్, వ్యాక్సిన్స్ పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ఏఐడీ) సహకారంతో భారత్‌కు ఆరు దఫాల్లో వైద్య సామాగ్రి చేరవేసినట్లు బైడెన్ పేర్కొన్నారు. వీటిలో ప్రధానంగా హెల్త్ సప్లైస్, ఆక్సిజన్ సిలిండర్స్, ఎన్-95 మాస్క్‌లు, మెడిసిన్స్ ఉన్నట్లు తెలిపారు.


ఈ సందర్భంగా తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు బైడెన్ చెప్పారు. "నేను భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. ఆ దేశానికి అత్యవసరంగా కావాల్సిన వాటి గురించి అడిగి తెలుసుకున్నాను. టీకాల తయారీ కోసం ముడి పదార్థాలు కావాలని మోదీ అడిగారు. వెంటనే వాటిని పంపిస్తున్నాం. వాటితో పాటు ఆక్సిజన్ పంపిస్తున్నాం. ఇతర ప్రధాన వైద్య పరికరాలనూ సైతం చేరవేస్తున్నాం. ఇలా భారత్ కోసం మేం చాలా చేస్తున్నాం." అని బైడెన్ మంగళవారం శ్వేతసౌధం వద్ద మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు.


అలాగే జులై 4 నాటికి అమెరికాలోని 10 శాతం టీకాలను ఇతర దేశాలకు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ అందుకునే దేశాల్లో కెనడా, మెక్సికోతో పాటు భారత్ కూడా ఉంటుందని తెలిపారు. ఇదిలాఉంటే.. అగ్రరాజ్యం నుంచి ఇప్పటి వరకు ఆరు విమానాలు భారత్​కు చేరుకున్నాయి. వీటిలో అమెరికా ఔషధాలు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లను భారత్‌కు పంపించింది. కాగా, ఇండియాకు అమెరికా అత్యవసర సాయంగా 100 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.744కోట్లు) ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-05-05T14:09:41+05:30 IST