రెండు వారాల సెలవు కోసం.. ఈ ఉద్యోగి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2020-03-22T08:05:00+05:30 IST

రెండు వారాల పెయిడ్ లీవ్ కోసం కరోనా సోకినట్టు అబద్దాలు చెప్పిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని సౌత్

రెండు వారాల సెలవు కోసం.. ఈ ఉద్యోగి ఏం చేశాడంటే..

కొలంబియా: రెండు వారాల పెయిడ్ లీవ్ కోసం కరోనా సోకినట్టు అబద్దాలు చెప్పిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని సౌత్ కెరోలినా రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరంగా చెప్పాలంటే.. జెఫ్రీ ట్రావిస్(31) అనే వ్యక్తి ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆఫీసుల్లో ఒక్క వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలినా రోజుల పాటు ఆఫీసుకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో జెఫ్రీ కరోనా వచ్చినట్టు నాటకం ఆడితే పెయిడ్ లీవ్స్ వస్తాయని అనుకున్నాడు. దీని కోసం ఓ డాక్టర్ నోట్‌ను దొంగతనం చేశాడు. అందులో తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు సృష్టించాడు. 


ఆ డాక్టర్ నోట్‌లో జెఫ్రీ ఏం రాసుకొచ్చాడంటే.. ‘జెఫ్రీ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. రెండు వారాల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహించాక ఇతను ఆఫీసుకు వెళ్లవచ్చు’ అని రాసుకొచ్చాడు. ఇదే నోట్‌ను తన బాస్‌కు చూపించగా.. వెంటనే ఆందోళన చెందాడు. జెఫ్రీతో పాటు ఆఫీసు మొత్తానికి సెలవులిచ్చేశాడు. చివరకు జెఫ్రీ చెప్పింది మొత్తం అబద్దం అని తెలుసుకున్న బాస్.. జెఫ్రీని వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాకుండా జెఫ్రీపై కేసు కూడా పెట్టాడు. జెఫ్రీ వల్ల కంపెనీకి, ఉద్యోగులకు ఎంతో ఇబ్బంది కలిగిందంటూ బాస్ పోలీసులకు వివరించాడు. జెఫ్రీ చేసిన తప్పుకు అధికారులు అతనిపై పలు కేసులు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేశారు. కాగా.. సౌత్ కెరోలినా వ్యాప్తంగా ఇప్పటి వరకు 81 కరోనా కేసులు నమోదవగా.. ఒకరు మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి.

Updated Date - 2020-03-22T08:05:00+05:30 IST