కుక్కకు డ్రైవింగ్ నేర్పుతున్న అమెరికన్.. షాకైన పోలీసులు

ABN , First Publish Date - 2020-03-31T23:32:33+05:30 IST

అమెరికాను కొవిడ్-19 కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్

కుక్కకు డ్రైవింగ్ నేర్పుతున్న అమెరికన్.. షాకైన పోలీసులు

సియాటిల్: అమెరికాను కొవిడ్-19 కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ దేశం మొత్తం వ్యాపిస్తున్నా చాలా మంది అమెరికన్లు భయం లేకుండానే తిరిగేస్తున్నారు. పైగా వీరందరూ పోలీసులకు తలనొప్పిగా మారారు. ఇటీవల కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ఒక అమెరికన్ వేగంగా కారులో వెళ్తూ ఫ్లోరిడా పోలీసులకు చిక్కాడు. కారు దిగమంటే తనకు కరోనా సోకిందంటూ పోలీసు అధికారిపై దగ్గి బెదిరించాలనుకున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా సియాటిల్ పోలీసులు వేగంగా వెళ్తున్న కారును ఆపి.. అందులో వ్యక్తి చెప్పిన కారణం విని కంగుతిన్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. 


ఒక కారు రెండు వాహనాలను ఢీకొట్టి వేగంగా వెళ్తోందంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఆ కారును పోలీసులు చేజ్ చేయడం మొదలుపెట్టగా.. కారులో ఉన్న వ్యక్తి 160 కి.మీ వేగంతో దూసుకెళ్లడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులు ముళ్ల కంచె(స్పైక్ స్ట్రిప్స్)కు పనిచెప్పడంతో ఎట్టకేలకు కారును ఆపగలిగారు. వెంటనే కారు దగ్గరకు చేరుకున్న పోలీసులు కారు లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. కారును మనిషి బదులు ఓ కుక్క నడుపుతుండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆల్బర్టో(51) అనే వ్యక్తి ప్యాసెంజర్ సీట్‌లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో కూర్చోపెట్టినట్టు పోలీసులు తెలిపారు. కారును ఆపరేట్ చేస్తూ కుక్కతో నడిపిస్తున్నాడు. కాగా.. ఇదేందంటూ ఆల్బర్టోను పోలీసులు ప్రశ్నించగా.. తన కుక్కకు కార్ డ్రైవింగ్ నేర్పుతున్నానంటూ జవాబిచ్చాడు. తన పదేళ్ల సర్వీస్‌లో ఇలాంటి సమాధానం చెప్పిన వ్యక్తినే చూడలేదని పోలీసు అధికారి హీథర్ తెలిపారు. కాగా.. ఆ వ్యక్తి వాషింగ్టన్‌కు చెందిన వాడని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 

Updated Date - 2020-03-31T23:32:33+05:30 IST