జొకో.. అదే జోరు

ABN , First Publish Date - 2020-09-06T09:20:52+05:30 IST

ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఈ ఏడాది తన అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తున్నాడు. యూఎస్‌ ఓపెన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శనతో ...

జొకో.. అదే జోరు

ప్రీక్వార్టర్స్‌లో నొవాక్‌, క్విటోవా, ఒసాక

సిట్సిపాస్‌ అవుట్‌

యూఎస్‌ ఓపెన్‌


న్యూయార్క్‌: ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఈ ఏడాది తన అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తున్నాడు. యూఎస్‌ ఓపెన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగుతూ నాలుగో రౌండ్‌లో ప్రవేశించాడు. నడాల్‌, ఫెడరర్‌ లేని ఈ టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా ఉన్న సెర్బియా హీరో నాలుగోసారి ఇక్కడ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరోవైపు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సిట్సిపా్‌సకు షాక్‌ తగలగా.. మహిళల సింగిల్స్‌లో కెర్బర్‌, ఒసాక, క్విటోవా నాలుగో రౌండ్‌కు చేరారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో సెర్బియా హీరో జొకో 6-3, 6-3, 6-1 తేడాతో జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ)పై సునాయాసంగా గెలిచి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. ఈ సీజన్‌లో అతడికిది వరుసగా 26వ విజయం కాగా, హార్డ్‌ కోర్ట్‌లో 600వది కావడం విశేషం. క్వార్టర్స్‌లో చోటు కోసం జొకో ఆదివారం పాబ్లో బుస్టాతో తలపడతాడు.

జ్వెరెవ్‌ మ్యాచ్‌కు ముందు హైడ్రామా

అమెరికా సమయం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఐదోసీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), మన్నారినో (ఫ్రాన్స్‌) మధ్య జరగాల్సిన మ్యాచ్‌ ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కరోనాతో టోర్నీ నుంచి వైదొలిగిన బెనోయిట్‌ పెయిర్‌తో మన్నారినో కాంటాక్ట్‌ అయ్యాడని, అతడు క్వారంటైన్‌లో ఉండాలని న్యూయార్క్‌ స్టేట్‌ హెల్త్‌ అధికారులు టోర్నీ నిర్వాహకులకు తేల్చి చెప్పారు. దీంతో ఈ మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నా.. తీవ్ర చర్చల అనంతరం సమస్య పరిష్కారమైంది.. మ్యాచ్‌లో అతను ఆడాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ 6-7, 6-4, 6-2, 6-2తో నెగ్గాడు. నాలుగున్నర గంటలపాటు జరిగిన మారథాన్‌ మ్యాచ్‌లో బోర్నా కొరిక్‌ (క్రొయేషియా) 6-7, 6-4, 4-6, 7-5, 7-6తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను కంగుతినిపించాడు. నాలుగో సెట్‌లోనైతే 1-5తో వెనకబడిన దశలోనూ ప్రత్యర్థి ఆరు మ్యాచ్‌ పాయింట్లను అడ్డుకుంటూ కొరిక్‌ 7-5తో నెగ్గాడు. చివరి సెట్‌లోనూ అతడు పోరాటం వదల్లేదు.

క్విటోవా, కెర్బర్‌ నాలుగో రౌండ్‌కు..

మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో చెక్‌ సుందరి పెట్రా క్విటోవా 6-4, 6-3 తేడాతో జెస్సికా పెగులా (అమెరికా)పై నెగ్గింది. రెండుసార్లు వింబుల్డన్‌ నెగ్గిన ఆరోసీడ్‌ క్విటోవా ఏకంగా 28 అనవసర తప్పిదాలు, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లకు పాల్పడినా మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. ఇక నాలుగోసీడ్‌ నవోమి ఒసాక (జపాన్‌) 6-3, 6-7 (4/7), 6-2 తేడాతో 18 ఏళ్ల మార్టా కోస్టుక్‌ (ఉక్రెయిన్‌)పై కష్టపడి నెగ్గింది. 


డబుల్స్‌లో బోపన్న ముందంజ

పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన రోహన్‌ బోపన్న-డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) ద్వయం 6-2, 6-4తో ఎస్కోబెడో-రుబిన్‌ (అమెరికా) జంటపై గెలిచి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. సుమిత్‌ నగాల్‌, దివిజ్‌ శరణ్‌ల నిష్క్రమణతో భారత్‌ నుంచి టోర్నీలో బోపన్న మాత్రమే మిగిలాడు. 

Updated Date - 2020-09-06T09:20:52+05:30 IST