అయ్యో... జొకో!

ABN , First Publish Date - 2020-09-08T09:34:15+05:30 IST

అంతా సవ్యంగా సాగుతున్న యూఎస్‌ ఓపెన్‌లో నిజంగా ఇది అనూహ్య పరిణామమే. ఈ సీజన్‌లో వరుసగా 26 విజయాలతో ఊపుమీ ...

అయ్యో... జొకో!

దురదృష్టమంటే ఇదేనేమో.. ఫెడరర్‌, నడాల్‌ గైర్హాజరీలో వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు ఈసారి గెలుపు నల్లేరుపై బండి నడకే అని అంతా భావిస్తున్న తరుణంలో చేజేతులా యూఎస్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థి చేతిలో 

వెనకబడ్డాడన్న అసహనంతో బంతిని కోర్టు బయటికి కొట్టడంతో అది నేరుగా వెళ్లి మహిళా లైన్‌ జడ్జి గొంతుకు తాకడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో నిబంధనల ప్రకారం ‘జోకర్‌’పై అనర్హత వేటు పడింది.


యూఎస్‌ ఓపెన్‌ నుంచి బహిష్కరణ

కొంపముంచిన అసహనం 

మహిళా లైన్‌మన్‌కు తాకిన బంతి


న్యూయార్క్‌: అంతా సవ్యంగా సాగుతున్న యూఎస్‌ ఓపెన్‌లో నిజంగా ఇది అనూహ్య పరిణామమే. ఈ సీజన్‌లో వరుసగా 26 విజయాలతో ఊపుమీ దుండడంతో పాటు నడాల్‌, ఫెడరర్‌ లేని చోట 18వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నెంబర్‌వన్‌ జొకోవిచ్‌ అర్ధంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. టెన్నిస్‌ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించడమే దీనికి కారణం. వివరాల్లోకెళితే.. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో జొకో స్పెయిన్‌ ఆటగాడు పాబ్లో కరెనో బస్టాతో తలపడ్డాడు. అయితే తొలి సెట్‌లో 5-4తో ఆధిక్యం ఉన్న దశలో రెండు సెట్‌ పాయింట్లు కోల్పోవడంతో పాటు, తన సర్వీస్‌ను బ్రేక్‌ చేస్తూ ప్రత్యర్థి 6-5తో ఆధిక్యంలోకి వెళ్లడం జొకోను తీవ్ర అసహనానికి గురిచేసింది. దీంతో విరామంలో తన సీటు వద్దకు వచ్చే క్రమంలో బంతిని తన ఎడమవైపునకు రాకెట్‌తో కొట్టాడు. అంతే.. అది నేరుగా వెళ్లి అక్కడ నిలుచున్న మహిళా లైన్‌ జడ్జి గొంతుకు తాకడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. శ్వాస తీసుకోవడం కూడా ఆమెకు ఇబ్బందిగా మారింది. ఇది చూసిన జొకో షాక్‌కు గురై ఆమె దగ్గరికెళ్లి క్షమాపణ చెప్పాడు. కాస్త చికిత్స తర్వాత ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. కానీ టోర్నీ రెఫరీ, అంపైర్‌, సూపర్‌వైజర్‌ కలిసి 10 నిమిషాలపాటు నొవాక్‌తో మాట్లాడారు. జరిగిందేమిటో వివరించే క్రమంలో, జొకో వారిని ప్రాధేయపడుతున్నట్టు వీడియోలో కనిపించింది. కానీ కోర్టులో ఎవరైనా అలా ప్రమాదకరంగా బంతి విసరడం నిషేధం కాబట్టి రూల్‌ ప్రకారం రెఫరీ.. జొకోవిచ్‌పై అనర్హత వేటు వేసి బుస్టాను మ్యాచ్‌ విజేతగా ప్రకటించారు. దీంతో సెర్బియా స్టార్‌ నిరాశగా కోర్టును వీడాల్సి వచ్చింది. మరోవైపు ఈ సంఘటనను తాను చూడలేదని, జొకోవిచ్‌ ఇది కావాలని చేసి ఉండడని ప్రత్యర్థి బుస్టా తెలిపాడు. 1990లో జాన్‌ మెకెన్రో తర్వాత ఇలాఓ గ్రాండ్‌స్లామ్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) నుంచి అర్థంతరంగా ఆటగాడిని బహిష్కరించడం ఇదే తొలిసారి. ఈ ప్రవర్తనకు టోర్నీలో సాధించిన ర్యాంకింగ్‌ పాయింట్లతోపాటు 2 లక్షల 50వేల డాలర్ల ప్రైజ్‌మనీని కూడా జొకో కోల్పోతాడని యూఎస్‌ టెన్నిస్‌ సంఘం ప్రకటించింది. అలాగే దెబ్బ తగిలిన మహిళ చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుందని తెలిపింది.

ఇది నాకో గుణపాఠం: జొకో

ప్రీ క్వార్టర్స్‌ ఉదంతంపై భావోద్వేగానికి గురైన జొకోవిచ్‌ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణలు కోరాడు. ‘ఆ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. అయితే లైన్‌జడ్జికి ఏమీ కానందుకు సంతోషంగా ఉంది. ఆమెకు కలిగిన బాధకు నిజంగా క్షంతవ్యుణ్ణి. అనుకోకుండా జరిగినా, నేను చేసింది తప్పే. కెరీర్‌లో మరింత ఎదిగేందుకు, మంచి మనిషిగా మారేందుకు ఈ అనర్హత నాకు  గుణపాఠంలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపాడు. ఈ ఉదంతంపై టెన్నిస్‌ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అతడు కావాలని చేయకపోయినా నిబంధనల ప్రకారం ఏది జరగాలో అదే జరిగిందని చెప్పారు. 

క్విటోవాకు షాక్‌..క్వార్టర్స్‌లో సెరెనా

పురుషుల సింగిల్స్‌లో జ్వెరేవ్‌ 6-2, 6-2, 6-1తో డేవిడోవిచ్‌పై, షపోవలోవ్‌ 6-7, 6-3, 6-4, 6-3తో గాఫిన్‌పై, కోరిచ్‌ 7-5, 6-1, 6-3తో థామ్సన్‌పై గెలిచి క్వార్టర్స్‌ చేరారు. మహిళల  ప్రీక్వార్టర్స్‌లో ఆరోసీడ్‌ క్విటోవాకు షాక్‌ తగిలింది. 6-7, 6-3, 6-7తో షెల్బీ రోజర్స్‌ చేతిలో ఓడింది. ఇక సెరెనా విలియమ్స్‌ 6-3, 6-7(6-8), 6-3తో సక్కారిపై, ఒసాక  6-3, 6-4తో కొంటావీట్‌పై, పుటిన్‌త్సెవా 6-3, 2-6, 6-4తో 8వ సీడ్‌ పెట్రా మార్టిక్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. 


‘బిగ్‌ త్రీ’ లేకుండానే..

నొవాక్‌ అర్ధంతర నిష్క్రమణతో ఈసారి యూఎస్‌ ఓపెన్‌ కళ తప్పినట్టయింది. ఎందుకంటే టోర్నీకి ముందే నడాల్‌, ఫెడరర్‌ వైదొలగడంతో జొకోకు టైటిల్‌ ఖాయమనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అతను క్వార్టర్స్‌కు ముందే వెళ్లడంతో బిగ్‌ త్రీ కాకుండా మరో ఆటగాడు విజేత కాబోతున్నాడు. 2004 నుంచి 2019 వరకు గత 16 ఏళ్లలో యూఎస్‌ ఓపెన్‌ను 12 సార్లు ఫెడరర్‌, నడాల్‌, జొకోవిచ్‌లలో ఒకరు గెలుచుకున్నారు. అందుకేనేమో.. ఇక టోర్నీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని జర్మనీ స్టార్‌ జ్వెరేవ్‌ అన్నాడు.

Updated Date - 2020-09-08T09:34:15+05:30 IST