Abn logo
Sep 21 2021 @ 19:09PM

Americans కు మరో కొత్త టెన్షన్.. వెంటాడుతున్న 'సైలెంట్ కిల్లర్'..!

వాషింగ్టన్: ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న అగ్రరాజ్యం అమెరికను ఇప్పుడు మరో కొత్త టెన్షన్ పట్టుకుంది. అమెరికన్లను ఓ 'సైలెంట్ కిల్లర్' వెంటాడుతున్నట్లు ఇటీవల  అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అదే.. అధిక వేడి. వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకీ వీపరితమైన వేడి పెరుగుతున్నట్లు అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి అనేది అమెరికాలో ప్రస్తుతం వాతావరణ సంబంధిత కిల్లర్‌గా పరిణమిస్తున్నట్లు నేషనల్ వేదర్ సర్వీస్(ఎన్‌డబ్ల్యూఎస్ ) డేటా పేర్కొంది. దీనివల్ల అటవీ ప్రాంతాల్లో దావానలం సంభవించి అది కాస్తా జనవాసాలకు విస్తరించడంతో దేశవ్యాప్తంగా వందలాది మంది మృ‌తికి కారణమవుతుందట. ఇటీవల సంభవించిన ఐడా హరికేన్ లూసియానాను ఎంతంటి దెబ్బతీసిందో తెలిసిందే. 


ఐడా బీభత్సం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈ రాష్ట్రంలోని న్యూ ఓర్లీన్స్ నగరంతో పాటు సుమారు మిలియన్ మంది అంధకారంలోకి వెళ్లిపోయారు. ఆగస్టు 29న ఐడా హరికేన్ వల్ల ఇలా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అలాగే ఐడా కారణంగా లూసియానాలో సంభవించిన 28 మరణాల్లో 12 వేడి వల్ల జరిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన వేడితో సంభవించిన విపత్తుల వల్ల అమెరికా వ్యాప్తంగా ప్రతియేటా భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని ఎన్‌డబ్ల్యూఎస్ వివవరించింది.


ఇవి కూడా చదవండి..

భారతీయులకు గుడ్‌న్యూస్.. బైడెన్ సర్కారు కీలక నిర్ణయం..

India లో తన ఆస్తిని విక్రయించిన American.. ఇన్‌కం ట్యాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే..

ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వేడి సంబంధిత అనారోగ్యాలను తగ్గించే కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సోమవారం యూఎస్ కార్మిక, ఆరోగ్యశాఖలతో పాటు ఇతర ఫెడరల్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఈ సందర్భంగా శ్వేతసౌధం వాతావరణ సలహాదారు గినా మెక్‌కార్తీ మాట్లాడుతూ.. అధిక వేడిని ఆమె 'సైలెంట్ కిల్లర్'గా పేర్కొన్నారు. ఇది పేదలు, వృద్ధులు, మైనారిటీ వర్గాలను అసమానంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఇది ప్రాణాంతకమైన పరిణామాలను కలిగి ఉన్న ఒక భయంకరమైన విపత్తుగా ఆమె పేర్కొన్నారు. చాలామంది దీన్ని నిజమైన శారీరక సమస్యగా గుర్తించడం లేదని, గుర్తించేసరికి ఆలస్యం అవుతుందని, దాంతో ప్రాణాలు పోతున్నట్లు మెక్‌కార్తీ చెప్పుకొచ్చారు.

అందుకే బైడెన్ ఆధ్యర్యంలో వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న అధిక వేడిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. వాతావరణ మార్పులతో తీవ్రతరం అయిన పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లో జూన్‌లో సంభవించిన అధిక వేడి వేలాది మరణాలకు కారణమైంది. అంతేగాక వేడికి సంబంధించిన అనారోగ్యాలతో వేలాది మంది ఎవర్జెన్సీ వార్డుల్లో చేరినట్లు ఆమె గుర్తుచేశారు. ప్రధానంగా వ్యవసాయ, భవన నిర్మాణ కార్మికులు హీట్ స్ట్రోక్, ఇతర సమస్యలకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని వైట్‌హౌస్ తెలిపింది. అలాగే వాతావరణ నియంత్రిత పరిసరాలు లేని ఇతర కార్మికులు కూడా ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

"పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మిలియన్ల మంది అమెరికన్ కార్మికులకు, ఎయిర్ కండీషనింగ్ లేని పాఠశాలల్లోని పిల్లలకు, శీతలీకరణ వనరులు లేని నర్సింగ్ హోమ్‌లలోని సీనియర్‌లకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ముప్పును కలిగిస్తాయి." అని బైడెన్ అన్నారు. పట్టణ అటవీ కార్యక్రమాలు, ఇతర 'గ్రీనింగ్' ప్రాజెక్టులను తీవ్ర ఉష్ణోగ్రతలు, అధిక వేడి బహిర్గతాన్ని తగ్గించడానికి రాబోయే రోజుల్లో విస్తరింపజేయనున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. అలాగే వాతావరణాన్ని నాశనం చేసే మీథేన్ లీక్‌లను తగ్గించడానికి యూరోపియన్ యూనియన్‌తో కీలక ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు శుక్రవారం ప్రకటించారు. ఇక చమురు, గ్యాస్, బొగ్గును కాల్చడం వల్ల వాతావరణ నష్టం స్థాయి విపత్తుగా, కోలుకోలేని స్థితికి చేరుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడే దీన్ని అదుపుచేయకపోతే మునుముందు పరిస్థితులు ఇంకా విషమంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...