మరో ఇద్దరు భారత సంతతి వైద్యులను.. కీలక పదవులకు నామినేట్ చేసిన బైడెన్!

ABN , First Publish Date - 2021-07-14T21:40:36+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసేందుకు తాజాగా మరో ఇద్దరు భారత సంతతి వైద్యులను కీలక పదవులకు నామినేట్ చేశారు.

మరో ఇద్దరు భారత సంతతి వైద్యులను.. కీలక పదవులకు నామినేట్ చేసిన బైడెన్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసేందుకు తాజాగా మరో ఇద్దరు భారత సంతతి వైద్యులను కీలక పదవులకు నామినేట్ చేశారు. ఆఫీస్ ఆఫ్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్‌గా డా. రాహుల్ గుప్తాను, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నెషనల్ డెవలప్‌మెంట్‌కు చెందిన గ్లోబల్ హెల్త్ బ్యూరో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా డా. అతుల్ గవాండేను నామినేట్ చేశారు. ఈ మేరకు మంగళవారం వైట్‌హౌస్ ప్రకటన విడుదల చేసింది. వైద్యరంగంలో 25 ఏళ్ల అనుభవం ఉన్న రాహుల్ గుప్తా ఇంతకుముందు ఇద్దరు గవర్నర్ల వద్ద పశ్చిమ వర్జీనియా హెల్త్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 


అలాగే ఎబోలా వైరస్ ప్రబలిన సమయంలో రాష్ట్రానికి చెందిన జికా యాక్షన్ ప్లాన్‌లో ఆయన కీలకంగా వ్యహరించారు. భారత దౌత్యవేత్త కుమారుడైన రాహుల్ గుప్తా 21వ ఏటా యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి మెడికల్ స్కూల్ పూర్తి చేశారు. ఆ తర్వాత అలబామా-బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. దీంతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్‌లో మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పట్టా పొందారు. 


ఇక 55 ఏళ్ల గవాండే సర్జన్‌తో పాటు మంచి రచయిత కూడా. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల్లో గవాండే రాసిన నాలుగు బుక్స్ కాంప్లికేషన్స్, బెట్టర్, ది చెక్‌లిస్ట్ మానిఫెస్టో, బీయింగ్ మోర్టల్‌‌కు చోటు లభించడం విశేషం. ఆయన అరియాడ్నే ల్యాబ్ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాజాగా తనను బైడెన్ కీలక పదవికి నామినేట్ చేయడం పట్ల గవాండే హర్షం వ్యక్తం చేశారు. ఎంతో నమ్మకంగా అధ్యక్షుడు తనకు అప్పగించిన విధులను అంతే సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. 

Updated Date - 2021-07-14T21:40:36+05:30 IST