అమెరికాలో 'కరోనా' విలయతాండవం.. 1000 దాటిన మరణాలు

ABN , First Publish Date - 2020-03-26T19:19:17+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్(కొవిడ్-19) విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరిగి పోతున్నాయి.

అమెరికాలో 'కరోనా' విలయతాండవం.. 1000 దాటిన మరణాలు

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్(కొవిడ్-19) విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరిగి పోతున్నాయి. దీంతో అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 68 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాలు 1000 దాటి పోయాయి. ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4 రోజుల క్రితం 300 ఉండగా ఇప్పుడది వెయ్యి దాటిపోవడం ఆందోళన కలిగించే విషయం. కేవలం బుధవారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 223 మరణాలు సంభవించడం యూఎస్‌లో కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. 10 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉంటున్నారు.  


న్యూయార్క్, వాషింగ్టన్, లూసియానా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్, ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, మిచిగాన్, లోవా తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 30 వేల మంది బాధితులు ఉన్నారు. 285 మంది మృతి చెందారు. ఇక  'కొవిడ్-19' విజృంభిస్తుండడంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే కరోనా దెబ్బకు కుదేలైన అమెరికన్లను  ఆదుకొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు.. ట్రంప్‌ ప్రభుత్వం 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని కూడా ప్రకటించింది. దాని ప్రకారం.. 75 వేల డాలర్లలోపు ఆదాయం ఉన్న వారందరి ఖాతాల్లో 1,200 డాలర్ల (రూ.93 వేలు)చొప్పున జమ కానున్నాయి. 1.5 లక్షల డాలర్లలోపు ఆదాయం ఉన్న దంపతులకు 2,400 డాలర్లు (రూ.1.86 లక్షలు), పిల్లలకు ఒక్కొక్కరికి 500 డాలర్ల వంతున ఇవ్వనున్నారు.    

Updated Date - 2020-03-26T19:19:17+05:30 IST