జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వినియోగాన్ని ఆపండి

ABN , First Publish Date - 2021-04-14T13:38:16+05:30 IST

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ సింగిల్‌ డోసు కరోనా టీకా తీసుకున్న ఆరుగురిలో రక్తం గడ్డకట్టే దుష్ప్రభావం తలెత్తింది.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వినియోగాన్ని ఆపండి

అమెరికాకు ఎఫ్‌డీఏ, సీడీసీ సిఫారసు

దుష్ప్రభావాల నేపథ్యంలో అప్రమత్తం 

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 13: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ సింగిల్‌ డోసు కరోనా టీకా తీసుకున్న ఆరుగురిలో రక్తం గడ్డకట్టే దుష్ప్రభావం తలెత్తింది. ఈ నేపథ్యంలో దాని వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ), సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) అమెరికా ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. ఈమేరకు మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆరుగురు బాధితులు కూడా 18 నుంచి 48 ఏళ్లలోపు మహిళలేనని తెలిపాయి. టీకా తీసుకున్న ఆరు నుంచి 13 రోజుల తర్వాత వారిలో రక్తం గడ్డకట్టే దుష్ప్రభావం తలెత్తిందని పేర్కొన్నాయి. ఎఫ్‌డీఏ, సీడీసీ సిఫారసుల నేపథ్యంలో వెంటనే ఈ టీకా వినియోగాన్ని నిలిపివేసే దిశగా అమెరికా సర్కారు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ స్పందించింది. ‘‘ప్రజల ఆరోగ్య భద్రతకే మా తొలి ప్రాధాన్యం. టీకా దుష్ప్రభావాలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వ ఆరోగ్య విభాగాలకు అందించాం. రక్తం గడ్డకట్టే సమస్యకు మా వ్యాక్సిన్‌తో సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో ఇప్పటివరకు 68 లక్షల మందికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా వేయగా, కేవలం ఆరుగురిలో ఈ సమస్య రావడాన్ని భూతద్దంలో చూసి కలవరపడాల్సిన అవసరం లేదని, దానికి పరిష్కారాన్ని వెతికితే సరిపోతుందని ఎమోరీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కార్లోస్‌ డెల్‌ రియో వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-04-14T13:38:16+05:30 IST