యూఎస్ సెనేట్ కీలక బిల్లుకు ఆమోదం.. భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2020-12-05T18:22:52+05:30 IST

గతేడాది అమెరికాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిక్కు వ్యక్తి, పోలీస్ ఆఫీసర్ సందీప్ సింగ్ ధలివాల్‌కు అరుదైన గౌరవం దక్కింది.

యూఎస్ సెనేట్ కీలక బిల్లుకు ఆమోదం.. భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం

వాషింగ్టన్: గతేడాది అమెరికాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిక్కు వ్యక్తి, పోలీస్ ఆఫీసర్ సందీప్ సింగ్ ధలివాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ఓ పోస్టాఫీస్‌కు ధలివాల్ పేరును ఖరారు చేశారు. తాజాగా దీనికి సంబంధించిన బిల్లును అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హ్యూస్టన్‌లోని 315 అడిక్స్ హోవెల్ రోడ్‌లోని పోస్టాఫీసును 'డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ పోస్ట్ ఆఫీస్ భవనం'గా మార్చడానికి యూఎస్ ప్రతినిధుల సభ సెప్టెంబరులో ద్వైపాక్షిక చట్టాన్ని ఆమోదించింది. ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వైట్‌‌హౌస్ చేరింది. ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ బిల్లు చట్టంగా మారుతుంది. కాగా, ఈ గౌరవం దక్కించుకున్న రెండో భారతీయ వ్యక్తి ధలివాల్. అంతకుముందు అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు దలిప్ సింగ్ సౌంద్‌కు 2006లో ఈ గౌరవం దక్కింది. సౌత్ కాలిఫోర్నియాలోని ఓ పోస్టాఫీస్‌కు దలిప్ సింగ్ పేరు పెట్టారు. 


ఇక భారత్‌లో జన్మించిన ధలివాల్ తన తల్లిదండ్రులతో కలిసి హ్యూస్టన్ వలస వెళ్లారు. అక్కడే ధలివాల్ కుటుంబం స్థిరపడింది. ఈ క్రమంలో అమెరికన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించిన ధలివాల్ 2015లో హ్యారిస్ కౌంటీ పోలీస్ ఆఫీసర్‌గా వెళ్లారు. దీంతో టెక్సాస్‌లో తలపాగా, గడ్డంతో విధులు నిర్వహించిన తొలి సిక్కు ఆఫీసర్‌గా ధలివాల్ నిలిచారు. 2019, సెప్టెంబర్ 27న ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ధలివాల్‌ను గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఇక ధలివాల్‌కు తాజాగా దక్కిన గౌరవం పట్ల ఆయన తండ్రి పైరా సింగ్ ధలివాల్ హర్షం వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-12-05T18:22:52+05:30 IST