బైడెన్ ప్రమాణస్వీకారం వేళ.. వాషింగ్టన్ వెళ్లే దారులన్నీ క్లోజ్

ABN , First Publish Date - 2021-01-17T17:09:20+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

బైడెన్ ప్రమాణస్వీకారం వేళ.. వాషింగ్టన్ వెళ్లే దారులన్నీ క్లోజ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజధాని వాషింగ్టన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. కేపిటల్ భవనంపై దాడి ఘటన నేపథ్యంలో ప్రమాణస్వీకారోత్సవం నాడు రాజధానిలో మరోసారి ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) హెచ్చరించడంతో వాషింగ్టన్‌ను పూర్తిగా దిగ్బంధించడం జరిగింది. ప్రస్తుతం ఈ నగరం పటిష్టమైన రక్షణ వలయంలో ఉంది. 


ఇక మూడు రోజుల ముందు నుంచే వాషింగ్టన్ వెళ్లే దారులన్నింటినీ మూసివేయడం జరుగుతోందట. యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు, ప్రమాణస్వీకారం పర్యవేక్షణ కమిటీ మెంబర్ కరోలిన్ మలోనీ నుంచి ఈ మేరకు తాజాగా పలు ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలకు లేఖలు అందినట్లు తెలుస్తోంది. వీటిలో బస్ సంస్థలతో పాటు ఆటో రెంటల్ కంపెనీలు, హోటళ్లు ఉన్నాయి. బైడెన్ ప్రమాణస్వీకారం రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మలోనీ తన లేఖలో పేర్కొన్నారు. ఆమె నుంచి లేఖలు అందుకున్న సంస్థల్లో మెగాబస్, గ్రెయేహౌండ్, బోల్ట్‌బస్, పీటర్ పాన్, హయత్, హిల్టన్, మారియట్ ఉన్నాయి. దీంతో బస్ సంస్థలన్నీ కూడా 17 నుంచి 20 తేదీల మధ్య వాషింగ్టన్ రూట్లలో తమ సర్వీసులను క్యాన్సిల్ చేశాయి. అలాగే ఇతర రెంటల్ సంస్థలు, హోటళ్లు కూడా బుకింగ్స్‌ను నిలిపివేశాయి.  

Updated Date - 2021-01-17T17:09:20+05:30 IST