Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనాపై పోరులో భారత్​కు మా మద్దతు కొన‌సాగుతుంది: వైట్‌హౌస్

వాషింగ్ట‌న్‌: కరోనా సెకండ్ వేవ్‌తో భాత్‌ ఆగ‌మాగం అవుతోంది. అంత‌కంత‌కూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో మ‌హ‌మ్మారి వ‌ల్ల విషాద‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కొన్ని రాష్ట్రాల్లోని ఆస్ప‌త్రుల్లో క‌రోనా రోగుల‌కు బెడ్స్ దొర‌క‌ని ద‌యనీయ ప‌రిస్థితి నెల‌కొంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాణ‌వాయువు కొర‌త వేధిస్తోంది. ఔష‌ధాలు కూడా సరిగ్గా దొర‌క‌డం లేదు. ఇలా క‌రోనా రెండో ద‌శ వ‌ల్ల భార‌త్‌లో భ‌యాన‌క వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక క‌రోనాతో పోరాడుతున్న భార‌త్‌కు చాలా దేశాలు త‌మ వంత సాయం చేస్తూ ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నాయి. అటు అగ్ర‌రాజ్యం అమెరికా.. క‌రోనాతో అత‌లాకుత‌లం అవుతున్న భార‌త్‌కు భారీ సాయం అందిస్తోంది. ఈ క్రమంలో భారత్​కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని వైట్‌హౌస్‌‌ మరోసారి స్పష్టం చేసింది. 


ఈ సంద‌ర్భంగా అమెరికా స‌ర్కార్‌తో పాటు అక్కడి కార్పొరేట్‌ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడాన్ని గుర్తు చేసింది. ఇలా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌కు భారీ సాయం అందింద‌ని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్​ ప్రైస్​ అన్నారు. క‌రోనాపై పోరులో భారత్​తో కలిసి అగ్రరాజ్యం పనిచేస్తోందని వైట్‌హౌస్ పేర్కొంది. ఇప్ప‌టికే బైడెన్​ ప్రభుత్వం నుంచి 100 మిలియన్ డాలర్ల సహాయం అంద‌గా, ప్రైవేట్ సెక్టార్‌ నుంచి అదనంగా 400 మిలియన్ డాలర్లు విరాళంగా అందాయ‌ని శ్వేత‌సౌధం తెలిపింది. మంగ‌ళ‌వారం అధ్య‌క్ష భ‌వ‌నంలో మీడియాతో మాట్లాడిన నెడ్​ ప్రైస్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అలాగే భారత్​కు అందించే సహాయం గురించి తెలుసుకునేందుకు నిరంతరం భారత విదేశాంగ శాఖ ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు ఆయ‌న తెలిపారు. 


ఇక గ‌డిచిన ఆరు రోజుల్లో యూఎస్ఎయిడ్‌లో భాగంగా భార‌త్‌కు ఆరు విమానాలు అత్య‌వ‌స‌ర వైద్య సామాగ్రిని తీసుకెళ్లిన‌ట్లు నెడ్ ప్రైస్ చెప్పారు. వీటిలో 20,000 మోతాదుల‌ రెమ్‌డెసివిర్లు, 1,500 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, 550 మొబైల్‌ ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, మిలియ‌న్ వ‌ర‌కు ర్యాపిడ్ టెస్టు కిట్లు, సుమారు 2.5 మిలియ‌న్ల ఎన్-95 మాస్కులు, భారీ మొత్తం ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు, ఔష‌ధాలతో పాటు ఇత‌ర వైద్య సామాగ్రి ఉన్న‌ట్లు తెలిపారు.  ‌  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement