వాడుక భాష జీవధాతువు

ABN , First Publish Date - 2020-09-09T07:00:15+05:30 IST

‘గ్రాంథిక భాష కేవలం పుస్తకాల్లో మాత్రమే కనబడుతుంది. కానీ వాడుకభాష మనిషి రక్తంలో కలిసిపోయి ఉంటుంది’ అని అంటారు కాళోజీ. గ్రాంథిక భాషకు ...

వాడుక భాష జీవధాతువు

కాళోజీ పటానికి  పూలమాలలు వేసి తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మాత్రమే కాదు. ప్రభుత్వం చేయూత అందించి ఇంకా విస్తృతంగా తెలంగాణ భాష పదాలను వెలికితీసి వాటితో నిఘంటువు ప్రచురించాలి. అలాగే పరిపాలనలో తెలుగు భాష వినియోగాన్ని పెంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనే ఇచ్చినప్పుడే కాళోజీకి అసలైన నివాళి.


నేడు కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం

‘గ్రాంథిక భాష కేవలం పుస్తకాల్లో మాత్రమే కనబడుతుంది. కానీ వాడుకభాష మనిషి రక్తంలో కలిసిపోయి ఉంటుంది’ అని అంటారు కాళోజీ. గ్రాంథిక భాషకు నిఘంటువులలో అర్థాలు దొరుకుతాయి. ఆ భాషకు కట్టుబాట్లు నియమాలు ఉంటాయి. వ్యాకరణం, సంధులు అన్నీ కంఠస్థం చేయాలి. కానీ వాడుక భాష అలా కాదు. అది మన అమ్మ భాష. మన ప్రాంత భాష. ఏ ప్రాంతంలో పుట్టామో, పెరిగామో ఆ ప్రాంతంలోని యాస, విరుపు, వ్యంగ్యం ఇతరత్రా అన్ని స్థానిక అంశాలతో కూడి ఉంటుంది. తెలంగాణాలో గత శతాబ్ది 30వ దశకంలోనే వాడుక భాషలో రాసిన వారున్నారు. వెల్దుర్తి మాణిక్యరావు దయ్యాల పనుగడ  (1935–40) అనే కథను తర్జుమా చేశారు. ఇది ప్రముఖ రచయిత టాల్‌స్టాయ్ ‘ఫస్ట్ డిస్టిలరీ’ నాటకం నుంచి తీసుకున్నది. మాణిక్యరావు పక్కా మెదక్ మాండలికంలో ఈ కథ రాశారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణా యాసలో కథలు రాయడం ఆయన తోనే మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత సురమౌళి ‘అంగడి పొద్దు’ మరికొన్ని కథలు రాశారు. ఆ తర్వాత అల్లం రాజయ్య లాంటి మరికొంతమంది అదే పంథాలో సాగారు.


తెలుగు అకాడమీ ఏర్పడ్డాక వాడుక భాషమీద మరి కొంత కృషి జరిగింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల కోసం వాడుక భాషలో కొన్ని వాచకాలను రూపొందించాలనే ప్రతిపాదన వచ్చింది. అప్పుడే, ఎవరి వాడుక భాషలో పుస్తకాలు తీర్చిదిద్దుతారని కాళోజీ ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల భాషను వాడుక భాషగా తీసుకుంటే వరంగల్ పోరడికి ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. ఆనాటి పత్రికల భాష, సినిమాలలో మాట్లాడే భాష కేవలం రెండున్నర జిల్లాల భాష అని ఆయన విమర్శించారు. ఈనాడు మన టీవీలలో తెలంగాణ మాండలిక భాషలో వచ్చే తీన్మార్, స్మార్ట్ న్యూస్ వంటి కార్యక్రమాలు బాగా ప్రసిద్ధమయ్యాయి. తెలంగాణ వాడుక భాష వినియోగం ఈ స్థాయికి చేరుకోవడం వెనుక కాళోజి నారాయణరావు కృషి ఎంతో ఉంది. ఆయన తెలంగాణా భాషా సంస్కృతుల మీద ఎంతో దృష్టి పెట్టారు. వాటిని వెక్కిరించే వారిని నిష్కర్షగా దుయ్యబట్టారు. ఆనాటి ఆకాశవాణిలో ప్రతి ఆదివారం వచ్చే బాలానందం కార్యక్రమంలో తెలంగాణ బాలలు ఎందుకు పాల్గొనరని, ఇక్కడి యాస, భాష అక్కరకు రావా ప్రశ్నించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల వారు తమ యాసను విడిచిపెట్టి రెండున్నర జిల్లాల భాష నేర్చుకున్న తర్వాతనే ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభించిందని పలు సందర్భాల్లో పేర్కొనేవారు.


గ్రాంథిక భాషలో ప్రాంతీయ భేదాలు ఉండవు. హైదరాబాద్‌ అయినా విశాఖపట్నం అయినా వరంగల్ అయినా రాయలసీమలోని కర్నూలు తిరుపతి అయినా అయినా అందరూ ఒకే తీరు రాస్తారు. కానీ మాండలికానికి వస్తే ఎవరి భాష వారిది ఎవరి వాదన వారిదే. అందుకే గ్రాంథికానికి ప్రాంతీయ భేదాలు లేవు. కానీ నిజమైన ఈ భాషను బ్రతికించే ప్రాణనాడులు మాండలికాలు మాత్రమేనని కాళోజీ అనేవారు. అలాగే పరభాషా వ్యామోహంలో పడి మాతృభాషను వదిలి పెట్టొద్దని ఆయన ఆనాడే చెప్పారు. ‘‘అంగ్రేజీ మాట్లాడటం గొప్పతనం కాదు. అక్కర ఉన్న దగ్గర ఇంగ్లీషులో మాట్లాడుకోండి. ఆ అక్కర వెళ్లతీసుకోండి. అంతవరకే కానీ ‘దో మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు, ఐ కాంట్ ఎక్స్ ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ తెలుగు, రియల్లీ దేర్ ఫోర్ ఐ వాంట్ టు అడ్రస్ యు ఇన్ ఇంగ్లీష్’ అనేటోళ్లతోనే నా బాధ అంతా’’ అంటూ తన ఆవేదన వెలిబుచ్చారు. 


‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అంటూ పరభాషా వ్యామోహంలో పడిపోతున్న తెలుగువారిని ఆనాడే విమర్శించారు. అవసరానికి అన్ని భాషలు నేర్చుకోవచ్చు కానీ మన మాతృభాషను విస్మరించకుండా, తప్పకుండా నేర్చుకోవాలని చెప్పేవారు. మనం మాట్లాడుకునే భాషలో రాయడం చాలా సులువు. అలా అయితే భావం చెడిపోకుండా మనం అనుకున్న విషయాలు అందులో రాయగలుగుతాం. లేకపోతే మనం గ్రాంథికభాషలోనో అన్యభాష మోజు లోనో పడి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతే అసలైన అర్థం చెడిపోతుందని అనేవారు. వాడుక భాష గురించి ఎన్నో విషయాలను తాను రాసిన ‘నా గొడవ’లో ప్రస్తావించారు. 


ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరొకసారి కాళోజీ భాషాభిమానాన్ని గుర్తు చేసుకోవడంతోపాటు మన తెలుగు భాషను, సంస్కృతిని, ముఖ్యంగా వాడుక భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం కాళోజీ పటానికి  పూలమాలలు వేసి తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మాత్రమే కాదు. ప్రభుత్వం చేయూత అందించి ఇంకా విస్తృతంగా తెలంగాణ భాష పదాలను వెలికితీసి వాటితో నిఘంటువు ప్రచురించాలి. అలాగే రాష్ట్ర పరిపాలనలో తెలుగు భాష వినియోగాన్ని పెంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనే ఇచ్చినప్పుడే కాళోజీ నారాయణరావుకు అసలైన నివాళి.

బండారు రామ్మోహనరావు

Updated Date - 2020-09-09T07:00:15+05:30 IST