ఈ మాత్రలు వేసుకుంటే అన్నం తినకపోయినా పర్లేదా..? డాక్టర్లు చెబుతున్న నిజాలివి..!

ABN , First Publish Date - 2021-12-14T19:15:46+05:30 IST

నీరసంగా ఉంటే బి కాంప్లెక్స్‌ మాత్ర మింగేస్తాం. బలహీనతను అధిగమించడం కోసం విటమిన్‌ మాత్రలను వేసుకుంటాం

ఈ మాత్రలు వేసుకుంటే అన్నం తినకపోయినా పర్లేదా..? డాక్టర్లు చెబుతున్న నిజాలివి..!

ఆంధ్రజ్యోతి(14-12-2021)


అపోహ-వాస్తవం

నీరసంగా ఉంటే బి కాంప్లెక్స్‌ మాత్ర మింగేస్తాం. బలహీనతను అధిగమించడం కోసం విటమిన్‌ మాత్రలను వేసుకుంటాం. కానీ వీటితో పోషక లోపాలు భర్తీ అవుతాయా? విటమిన్‌ సప్లిమెంట్ల గురించిన అపోహలు - వాస్తవాలను తెలుసుకుందాం! 


అపోహ: సరిగా తినకపోయినా ఫర్వాలేదు. ఒక మల్టీ విటమిన్‌ మాత్ర వేసుకుంటే సరిపోతుంది. 


వాస్తవం: ఎంతటి విటమిన్‌ సప్లిమెంట్‌ అయినా ఆహారంలోని పోషకాలన్నింటినీ భర్తీ చేయలేదు. ప్రకృతిసిద్ధ పోషకాలు లోపించిన ఆహారం తింటూ, విటమిన్‌ సప్లిమెంట్‌ వేసుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. 


అపోహ: బి కాంప్లెక్స్‌ సప్లిమెంట్‌ శరీరం మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. 


వాస్తవం: ప్రమాదాల దెబ్బలు, రుగ్మతలు, కాలిన గాయాలు, సర్జరీల కారణంగా శరీరం ఒత్తిడికి లోనయ్యే స్థితిని అధిక మొత్తం బి విటమిన్లు మెరుగ్గా తగ్గిస్తాయి. వాటి నుంచి త్వరగా కోలుకోవడానికి ఇవి తోడ్పడతాయి. అయితే అంత పరిమాణంలో బి విటమిన్లను బి కాంప్లెక్స్‌ సప్లిమెంట్లతో పొందే వీలుండదు. కాబట్టి పోషకాహారంతో పాటు అదనంగా వీటిని తీసుకోవాలి. అంతే తప్ప పూర్తిగా వీటి మీదే ఆధారపడకూడదు.


అపోహ: విటమిన్‌ సి జలుబును తగ్గిస్తుంది


వాస్తవం: జలుబు రాకుండా అడ్డుకోడానికీ, జలుబును తగ్గించడానికీ విటమిన్‌ సి ఏ రకంగానూ తోడ్పడదు. విటమిన్‌ సి సప్లిమెంట్‌ అవసరానికి మించి తీసుకున్నప్పుడు, శరీరం యాంటీహిస్టమిన్‌ రియాక్షన్‌కు లోనవుతుంది. దాంతో జలుబు తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి జలుబు తగ్గినట్టే తగ్గి, తిరగబెడుతుంది. 


అపోహ: విటమిన్‌ సప్లిమెంట్లతో అదనపు శక్తి సమకూరుతుంది


వాస్తవం: శరీరానికి క్యాలరీల ద్వారా శక్తి సమకూరుతుంది. విటమిన్‌ సప్లిమెంట్లలో క్యాలరీలు ఉండవు. అయితే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి సప్లిమెంట్లు సహాయపడతాయి. ఆహారం తీసుకోకుండా విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకోవడం... ఇంధనం లేకుండా వాహనాన్ని నడిపించే ప్రయత్నం చేయడంతో సమానం. కాబట్టి ఈ సప్లిమెంట్లను భోజనంతో పాటు తీసుకోవాలి.                           


Updated Date - 2021-12-14T19:15:46+05:30 IST