హెల్మెట్‌ వాడండి..కరోనా నుంచి కాపాడుకోండి!

ABN , First Publish Date - 2020-06-06T08:40:54+05:30 IST

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించి కరోనా నుంచి కాపాడుకోవాలని కృష్ణాజిల్లా రవాణా శాఖ

హెల్మెట్‌ వాడండి..కరోనా నుంచి కాపాడుకోండి!

ద్విచక్ర వాహనదారులకు పిలుపు 

కొద్ది రోజుల్లో రవాణా శాఖ మార్గదర్శకాలు 

ఇప్పటికే డ్రైవర్లు, క్లీనర్లకు అమలు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించి కరోనా నుంచి కాపాడుకోవాలని కృష్ణాజిల్లా రవాణా శాఖ పిలుపునిస్తోంది. లాక్‌డౌన్ల నేపథ్యంలో, రవాణాకు ఇచ్చిన సడలింపుల వల్ల రోడ్ల మీద వాహనాలు తిరుగుతున్నాయి. పక్షం రోజులుగా ఈ సంఖ్య భారీగానే పెరిగింది. దీంతో వాహనాల రద్దీ నేపథ్యంలో, కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రవాణా శాఖ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే లారీ డ్రైవర్లు, క్లీనర్లు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాలో పలుచోట్ల, నగర వ్యాప్తంగా కేసులు నమోదు కావటానికి ఎక్కువగా డ్రైవర్లే కారణమౌతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే ద్విచక్రవాహనదారులపైనా రవాణా శాఖ దృష్టి సారిస్తోంది. వీరికి హెల్మెట్‌ తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.


కరోనా సీజన్‌లో రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనదారులకు కరోన వైరస్‌ నుంచి హెల్మెట్‌ పూర్తి రక్షణగా ఉంటుందని భావిస్తోంది. హెల్మెట్‌ ధారణతో తల మొత్తం కవర్‌ అవుతుంది. వైరస్‌ కారకాల నుంచి రక్షించుకోవచ్చు. కళ్లు, ముక్కు, గొంతు, తల, జుట్టును మొత్తాన్ని హెల్మెట్‌ కవర్‌ చేస్తుంది కాబట్టి బయట తిరిగేవారికి అండగా ఉంటుందని రవాణాశాఖ భావిస్తోంది. అలాగే లారీల్లో డ్రైవర్లు, కండక్టర్లు ఉమ్మినా లాలాజలం వారిపై పడకుండా రక్షణ కల్పించటానికి కూడా హెల్మెట్‌ దోహదపడుతుంది. వీటన్నింటనికి దృష్టిలో ఉంచుకుని హెల్మెట్‌ను తప్పనిసరి చేయాలని, అందుకు అనుగుణంగా కొద్ది రోజుల్లో మార్గదర్శకాలను రవాణా శాఖ అధికారులు జారీ చేయబోతున్నారు.

Updated Date - 2020-06-06T08:40:54+05:30 IST