మీ ప్రాంతంలో రైతులు పత్తి కట్టె కాల్చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే...

ABN , First Publish Date - 2020-03-03T15:42:39+05:30 IST

రైతులు అత్యధికంగా పండించే పంటల్లో పత్తి ఒకటి. తెలంగాణలో వేలాది ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తిని సేకరించడం పూర్తైన...

మీ ప్రాంతంలో రైతులు పత్తి కట్టె కాల్చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే...

పత్తి కట్టే కదా అని.. కాల్చేయకండి!

ప్యాకింగ్‌ మెటీరియల్‌, ప్లైవుడ్‌ తయారీలో వినియోగం

సేంద్రియ ఎరువుగానూ ఉపయోగం

తగలబెడుతున్న రైతులు

అవగాహన కల్పిస్తే రైతుకు లాభసాటి


రైతులు అత్యధికంగా పండించే పంటల్లో పత్తి ఒకటి. తెలంగాణలో వేలాది ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తిని సేకరించడం పూర్తైన అనంతరం రైతులు ఎండిన మొక్కలను తొలగించి కాల్చేయడమో, భూమిలో కలియ దున్నేయడమో చేస్తుంటారు. కానీ పత్తి కట్టెతోనూ బోలెడు లాభాలున్నాయి. పక్క రాష్ట్రాల్లో రైతులు పత్తి కట్టెను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.


రైతులు పత్తి విత్తనాలను వానాకాలంలో నాటుకుంటారు. ఆరు నెలల అనంతరం పత్తిని సేకరించడం పూర్తవుతుంది. పంట తీసుకున్న అనంతరం మొక్కలు ఎండిపోతాయి. సాధారణంగా రైతులు వీటిని గుంటుకుతో తొలగించి, కుప్పలుగా పోసి కాల్చేస్తుంటారు. మరికొందరు రైతులు ట్రాక్టర్లతో భూమిలో కలియ దున్నేస్తుంటారు. కొందరు వంట చెరుకుగా వినియోగిస్తుంటారు.


పంట చేనులో పత్తి కట్టెను తగులబెట్టడంతో భూములు సారం దెబ్బతింటుంది. భూమిలో ఉండే మిత్ర పురుగులు, సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది. అంతేకాకుండా కట్టెను కాల్చే సమయంలో వచ్చే పొగ కారణంగా పర్యావరణానికి ముప్పు కలుగుతున్నది. అలాగే, భూమిలో కలియదున్నడంతో చీడపీడలు చేనులోనే ఆశ్రయం పొందుతుంటాయి. కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం పత్తి కట్టెను ప్యాకింగ్‌ మెటీరియల్‌, సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగిస్తున్నారు. దీని ద్వారా రైతులకు శ్రమ తగ్గడమే కాకుండా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.


అవగాహనతో రైతుకు లాభం

 పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఎండిన పత్తి కట్టెతో పార్టికల్‌ బోర్డులు, హార్డ్‌ బోర్డులు, కర్రుగేటెడ్‌ బోర్డులు, బాక్సులు, పేపర్‌ పల్ప్‌, ప్యాకింగ్‌ బాక్సులు ప్లైవుడ్‌ తయారు చేస్తున్నారు. తినదగిన పుట్టగొడుగుల పెంపులో మైక్రో క్రిస్టలిన్‌ సెల్యులోజ్‌ కోసం కూడా పత్తికర్రను వినియోగిస్తున్నారు. ఫ్యాక్టరీల యజమానులు తొలగించిన పత్తికట్టెను టన్నుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సాధారణం హెక్టారు పత్తి చేనులో 4 టన్నుల పత్తి కర్ర లభ్యమవుతుందని అంచనా. ఒక పత్తికర్రలో 68 శాతం హోలో సెల్యులోజ్‌, 26 శాతం లిగ్నిన్‌, 7 శాతం బూడిద లభ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘కేంద్ర పత్తి సాంకేతిక పరిశోధన సంస్థ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కాటన్‌ టెక్నాలజీ (సిర్‌కాట్‌--సీఐఆర్‌సీఈవోటీ)’ లెక్క కట్టింది. ఈ లెక్కన కట్టె అమ్మకం ద్వారా ప్రతీ రైతుకు హెక్టారుకు రూ. 1,200 నుంచి 1,600 ఆదాయం సమకూరుతుంది.


పత్తి కట్టెతో ఉపయోగాలు

ఎండి పత్తి కట్టెను పొడి చేసి వర్మీ కంపోస్ట్‌ తయారీలో వినియోగించవచ్చు. పశువులకు దాణాగా కూడా వాడవచ్చు. పొడి చేసి చేనులో చల్లితే బయోమార్చ్‌గా మారి తేమను నిలిపిఉంచే సామర్థ్యం పెరుగుతుంది. కలుపు మొక్కలు పెరుగకుండా కూడా అరికడుతుంది. పత్తికట్టెతో పిడకలు తయారుచేసి ఫ్యాక్టరీల్లో, బాయిలర్లలో బొగ్గుకు బదులుగా వాడవచ్చు. ప్యాకింగ్‌ మెటీరియల్‌ తయారీలో, ఫ్లైవుడ్‌ తయారీ, పేపర్‌ తయారీలోనూ పత్తికర్రలను వాడవచ్చు. పుట్టగొడుగుల సాగులో ఎరువుగానూ వాడుతుంటారు.


ఫ్యాక్టరీలతో ఉపాధికి ఊతం

మన ప్రాంతంలో దూదిపూలను సేకరించిన అనంతరం మొక్కలను తొలగించడానికి రైతులు ఎకరాకు రూ. 600 ఖర్చు చేస్తున్నారు. అసలే వాతావరణ ప్రభావంతో దిగుబడి సరిగ్గా రాక.. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి అప్పుల్లో కూరుకుపోతున్న రైతులకు ఇది అదనపు భారంగా పరిణమిస్తోంది. మన ప్రాంతంలో దూదిపూలను సేకరించిన అనంతరం మొక్కలను తొలగించడానికి రైతులు ఎకరాకు రూ. 600 ఖర్చు చేస్తున్నారు. అసలే వాతావరణ ప్రభావంతో దిగుబడి సరిగ్గారాక.. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి అప్పుల్లో కూరుకుపోతున్న రైతులకు ఇది అదనపు భారంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో పత్తికట్టెను సద్వినియోగం చేసుకునే పరిశ్రమల ఏర్పాటుకు యువతకు చేయూతనిస్తే రైతులకు లబ్ధి చేకూరుతుంది.

Updated Date - 2020-03-03T15:42:39+05:30 IST