బీజేపీవి కొనుగోలు రాజకీయాలు

ABN , First Publish Date - 2020-11-22T08:59:06+05:30 IST

బీజేపీ కొనుగోలు రాజకీయాలు చేస్తోందని, ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడానికే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌.. రాష్ట్రానికి వచ్చినట్లున్నారని టీపీసీసీ ..

బీజేపీవి కొనుగోలు రాజకీయాలు

అందుకే భూపేంద్ర యాదవ్‌ రాష్ట్రానికొచ్చారు

సిగ్గు లేకుండా మా నేతల ఇళ్లకు వెళ్తున్నారు

హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పండి

కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి: ఉత్తమ్‌  

మెట్రో పిల్లర్లు, పబ్లిక్‌ టాయ్‌లెట్లపైన టీఆర్‌ఎస్‌ ప్రచారంపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు


హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీజేపీ కొనుగోలు రాజకీయాలు చేస్తోందని, ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడానికే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌.. రాష్ట్రానికి వచ్చినట్లున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు పలువురు కాంగ్రెస్‌ నేతల ఇళ్లకు వెళ్లి డబ్బు ఆశ చూపుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లడానికి ఆ పార్టీ నేతలకు సిగ్గుండాలని విమర్శించారు. మెట్రో పిల్లర్లు, పబ్లిక్‌ టాయ్‌లెట్లు, బస్‌ షెల్టర్లపైన టీఆర్‌ఎస్‌ ప్రకటనలను తొలగించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్వవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తమ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ బృందం.. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పార్థసారథిని కలిసి ఫిర్యాదు చేసింది.


అనంతరం మీడియాతో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే మెట్రోరైల్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు మొదలయ్యాయని చెప్పారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖర్చు పెట్టామని టీఆర్‌ఎస్‌ చెబుతోందని, ఏం అభివృద్ధి చేశారో, ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. మజ్లిస్‌, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఒవైసీ సోదరులు అమిత్‌షాను కలిశారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారని పేర్కొన్నారు. అవినీతి టీఆర్‌ఎస్‌, మతతత్వ బీజేపీ, మజ్లిస్‌ పార్టీలను ఓడించాలని, హైదరాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన కాంగ్రె్‌సను గెలిపించాలని కోరారు. గ్రేటర్‌ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఎస్‌ఈసీ పార్థసారథిని కోరామని ఉత్తమ్‌ తెలిపారు.  

Updated Date - 2020-11-22T08:59:06+05:30 IST