స్వీపర్ భార్యకు బ్లాక్ అధికారి పదవి

ABN , First Publish Date - 2021-07-16T18:03:48+05:30 IST

భార్య ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే భర్తకు సంతోషంగా ఉంటుందా? అని ఎవరైనా అడిగితే..

స్వీపర్ భార్యకు బ్లాక్ అధికారి పదవి

ఉత్తరప్రదేశ్: భార్య ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే భర్తకు సంతోషంగా ఉంటుందా? అని ఎవరైనా అడిగితే మంచి మనసుతో ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంటుంది. అలా ఎంతో ఉత్సాహంగా భార్యను ప్రోత్సహిస్తున్న ఒక వ్యక్తి.. అత్యధిక జనాభాగల రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు. తాను స్వీపర్‌గా పనిచేస్తున్న కార్యాలయంలోనే భార్య బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్‌గా వచ్చినప్పటికీ ఆయన ఎక్కడా వెనుకాడలేదు. అన్ని రకాలుగా భార్యను ప్రోత్సహిస్తున్నారు.


నల్లరాగుజ్జర్ గ్రామంలో నివసిస్తున్న సునీల్ బలియాఖేరి డెవలప్‌మెంట్ బ్లాక్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల యూపీలో బ్లాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగగా అందులో తన భార్య సోనియా 55వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బ్లాక్ డెవలప్‌మెంట్ చీఫ్ అధికారి పోస్టుకు ఎన్నికలు జరగ్గా.. ఆ పోస్టును షెడ్యూల్ వర్గానికి కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ బీజేపీ నాయకుడు, జిల్లా పంచాయతీ సభ్యుడు ముఖేష్ చౌదరి నిర్ణయం మేరకు విద్యావంతురాలైన సోనియాను నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో కూడా ఆమె విజయం సాధించారు. బలియాఖేరి డెవలప్‌మెంట్ బ్లాక్‌లో తన భర్త స్వీపర్‌గా పనిచేస్తున్న కార్యాలయంలోనే సోనియా అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తన భార్య అధికారిగా రావడం సంతోషంగా ఉందని సునీల్ అన్నారు. అయినా తన స్వీపర్ ఉద్యోగాన్ని కొనసాగిస్తానని చెప్పారు. మరోవైపు తన కుటుంబం మద్దతుతోనే తాను విజయం సాధించానని సోనియా అన్నారు.

Updated Date - 2021-07-16T18:03:48+05:30 IST