యూపీ ఎన్నికలు : అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ?

ABN , First Publish Date - 2022-01-12T23:03:15+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేత, ముఖ్యమంత్రి

యూపీ ఎన్నికలు : అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ?

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. టిక్కెట్ల పంపిణీ కసరత్తు ప్రారంభం కావడంతో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాట్లాడుతూ, యోగి అయోధ్య నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. బీజేపీ అధికార పగ్గాలను చేపట్టడానికి గల కారణాల్లో రామాలయం నిర్మాణం పట్ల ప్రదర్శించిన వైఖరి కూడా ఒకటి అని, అనేక సంవత్సరాల పోరాటం తర్వాత 2019లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని చెప్తున్నారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ కోర్ కమిటీ సమావేశం న్యూఢిల్లీలో మంగళవారం జరిగింది. ఈ కమిటీలో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఆయన అయోధ్య నుంచి పోటీ చేసే అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థులను ఖరారు చేసే అధికారం బీజేపీ ఎన్నికల కమిటీకి మాత్రమే ఉంది. రాష్ట్ర బీజేపీ సలహాలను ఈ ఎన్నికల కమిటీ పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటుంది. యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య నుంచి కానీ, మధుర నుంచి కానీ పోటీ చేయించాలని చాలా మంది కోరుతున్నారు. 


403 స్థానాలున్న యూపీ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-01-12T23:03:15+05:30 IST