దూబేకు ఉప్పందించింది పోలీసులే..!

ABN , First Publish Date - 2020-07-05T07:01:56+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన కరడుగట్టిన నేరస్థుడు వికాస్‌ దూబేకు పోలీసుల రాకపై ముందే ఉప్పందిందా? పోలీసు వర్గాల నుంచే అతనికి సమాచారం...

దూబేకు ఉప్పందించింది పోలీసులే..!

4 గంటల ముందే సమాచారం 

అర్ధరాత్రి పోలీసులపై అతని ముఠా దాడి

చౌబేపూర్‌ ఎస్‌హెచ్‌వో సస్పెన్షన్‌ 

యూపీ ఎన్‌కౌంటర్‌లో కొత్తకోణం

దూబేను పట్టుకునేందుకు 25 బృందాలు

అతని ఇల్లు, వాహనాల ధ్వంసం 


లఖ్‌నవూ, జూలై 4: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన కరడుగట్టిన నేరస్థుడు వికాస్‌ దూబేకు పోలీసుల రాకపై ముందే ఉప్పందిందా? పోలీసు వర్గాల నుంచే అతనికి సమాచారం వెళ్లిందా? పక్కా ప్రణాళికతోనే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్‌కౌంటర్‌ జరిగిందా? అంటే యూపీ పోలీసు వర్గాలు అవుననే అంటున్నాయి. అసలేం జరిగిందంటే.. హత్యాయత్నం ఘటనకు సంబంధించి దూబేను ప్రశ్నించేందుకు గురువారం మధ్యాహ్నం చౌబేపూర్‌ స్టేషన్‌ నుంచి ఎస్‌హెచ్‌వో, నలుగురు సిబ్బంది వెళ్లారు. కోటలాంటి దూబే ఇంట్లోకి వెళ్లిన వారికి తీవ్ర అవమానం జరిగింది. చేసేదేంలేక వెనుదిరిగిన పోలీసులు.. జరిగిన అవమానాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో సమీపంలోని శివరాజ్‌పూర్‌, బిథుర్‌ స్టేషన్ల నుంచి 20 మందిని రప్పించి డీఎస్పీ దేవేంద్ర మిశ్రా నేతృత్వంలో వెళ్లి దూబేను అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే సమాచారం 4గంటల ముందే దూబేకు తెలిసిపోయిందని పోలీసులు విచారణలో గుర్తించారు.


ఈ క్రమంలోనే రాత్రి 9గంటలకు దూబే ముఠా రోడ్డుకు అడ్డంగా జేసీబీ యంత్రాన్ని నిలిపి ఉంచిందని తేల్చారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత పోలీసులు బిక్రు గ్రామ సమీపంలోకి రాగానే పక్కా ప్రణాళికతోనే దూబే ముఠా కాల్పులకు తెగబడినట్లు గుర్తించారు. చమురు బాంబులు విసిరి, కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ సహా 8 మందిని పొట్టనపెట్టుకున్న  ముఠా.. పోలీసుల ఆయుధాలను  ఎత్తుకెళ్లింది. దూబేతో చివరిసారిగా మాట్లాడిన 12మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్‌ లిస్టులో ముగ్గురు పోలీసుల పేర్లు   ఉన్నట్లు గుర్తించారు.  హత్య ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి వినయ్‌ తివారీని సస్పెండ్‌ చేశారు.  దూబేను పట్టుకునేందుకు 25 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు బహుమతి ప్రకటించారు. బిక్రులోని  దూబే ఇంటిని పోలీసులు శనివారం కూల్చివేశారు. రెండు కార్లను, గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుపెట్టిన యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారు. బిక్రు గ్రామస్థుల నుంచి దూబే బలవంతంగా భూమిని లాక్కొన్నాడని, అక్రమార్జనతో ఇల్లు కట్టాడని, గ్రామస్థులు అతనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా, మృతిచెందిన 8మంది పోలీసుల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించారు. డీఎస్పీ దేవేంద్ర మిశ్రా చితికి ఆయన కుమార్తె వైష్ణవి అశ్రునయనాలతో నిప్పుపెట్టారు.  


వాడ్ని ఎన్‌కౌంటర్‌ చేయండి: దూబే తల్లి 

ఎనిమిది మంది పోలీసులను చంపిన వికాస్‌ దూబేను ఎన్‌కౌంటర్‌ చేయాలని అతని తల్లి చెప్పారు. అతను చేసింది పెద్ద నేరమన్నారు. ‘‘వికాస్‌ వెంటనే పోలీసులకు లొంగిపోవాలి. లేదంటే పోలీసుల చేతిలో వాడికి చావు తప్పదు. పోలీసులకు ఒకటే చెబుతున్నా.. ఒకవేళ వికాస్‌ ప్రాణాలతో పట్టుబడినా కాల్చి చంపేయండి. ఎందుకంటే వాడు చేసింది పెద్ద తప్పు’’ అని వికాస్‌ తల్లి సరళాదేవి అన్నారు.   లఖ్‌నవూలోని చిన్న కుమారుడి ఇంటి వద్దే తాను ఉంటున్నానని ఆమె చెప్పారు. 

Updated Date - 2020-07-05T07:01:56+05:30 IST