ఉరి తాడై బిగుసుకుంది..

ABN , First Publish Date - 2021-04-04T17:40:00+05:30 IST

నిర్భయ హంతకులకు ఉరి వేసినప్పుడు యావద్దేశం హర్షించింది. అయితే ఆ నలుగురికి ఉరి వేసిన తలారి జీవితం మాత్రం తలకిందులైంది. ఊరూరా తిరిగి దుప్పట్లు అమ్ముకునే పవన్

ఉరి  తాడై బిగుసుకుంది..

మరో కోణం

నిర్భయ హంతకులకు ఉరి వేసినప్పుడు యావద్దేశం హర్షించింది. అయితే ఆ నలుగురికి ఉరి వేసిన తలారి జీవితం మాత్రం తలకిందులైంది. ఊరూరా తిరిగి దుప్పట్లు అమ్ముకునే పవన్‌ తలారిని చూస్తే చాలు... ఇప్పుడు జనం జడుసుకుంటున్నారు. ఉరి తీసే ఆ వృత్తే తన ఉపాధికి ఉరి తాడై బిగుసుకుంది.... 


‘ఒకరికి ఉరివేస్తే పాతికవేల రూపాయలు, అదే నలుగురికి వేస్తే లక్ష. నెల రోజుల్లో చిన్న కూతురు పెళ్లి. అందుకు రెండు లక్షలు ఖర్చు అవుతుంది. చేతిలో సగం మొత్తమే ఉంది. నలుగురికి ఉరి వేస్తే మిగతా సగం డబ్బు వస్తుంది. అమ్మాయి పెళ్లి చేసేయొచ్చు...’ 

ఇది సినిమాలోని దృశ్యం కాదు, కథలోని సన్నివేశం కాదు. పవన్‌ తలారి జీవితంలో ఎదురైన సంఘటన.


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నివాసి అయిన పవన్‌ వృత్తిరీత్యా తలారి. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీ వరకు కోర్టులు విధించిన మరణశిక్షలను ఉరికంబంపై అమలు చేసే పని ఆయనదే!. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులోని నలుగురు నిందితుల్ని ఉరి తీశాడు పవన్‌. ఆ రోజు ఇద్దరు తలారులు నలుగుర్ని ఉరి తీయాల్సి ఉంది. అయితే మరో తలారి అనారోగ్యరీత్యా ఆ రోజు రాలేదు. అప్పటికే అనేక కారణాల వల్ల నిర్భయ నిందితులకు ఉరి వాయిదా పడుతూ వచ్చింది. ప్రభుత్వాలు, కోర్టులు, పోలీసులపైన అనేక విమర్శలు వచ్చాయి. ప్రజల్లో అసహనం పెల్లుబికింది. తలారి రాకపోవడంతో మరోసారి ఉరితీత వాయిదా పడుతుందేమోనని జైలు అధికారులు భావించారు. అనేక తర్జనభర్జనల తరువాత నలుగురు నిందితులను ఉరి తీసే అవకాశం పవన్‌ తలారికే వచ్చింది. ఒకే రోజు ఒకే వ్యక్తి నలుగురికి ఉరి వేయడం స్వతంత్ర భారతంలో ఓ రికార్డుగా నిలిచింది.


నిర్భయ హంతకుల్ని ఉరి తీసిన పవన్‌ తలారిది ఇప్పుడొక వింత సమస్య. దోషుల్ని ఉరి తీశాడు బాగానే ఉంది. సమస్య అంతటితో అయిపోలేదు. ‘నువ్వు కొంత కాలం ఇంట్లో నుంచీ బయటికి రావొద్దు. ఊరు దాటి ఎటూ వెళ్లకు’ అని జైలు అధికారులు అప్పట్లో చెప్పి, చేతులు దులుపుకున్నారు. వాళ్లు చెప్పినట్లు ఆయన నాలుగు గోడల మధ్య కూర్చుంటే ఇల్లు గడవని పరిస్థితి. తన కొడుకులు అందరిలా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేయాలన్నది ఆయన కల. పిల్లలు కూడా తండ్రి తరువాత తలారి పని చేసేందుకు సిద్ధంగా లేరు. దేశంలో కొన్ని రకాల వృత్తులు ఇతరులు చేయలేరు కాబట్టి ఇదివరకే చేస్తున్న వాళ్లకు వంశపారంపర్య ముద్ర వేసి తరతరాలుగా కొన్ని కుటుంబాలకు, జాతులకు అప్పగించడం న్యాయమా? అన్నది పవన్‌ తలారి లాంటి వాళ్ల ఆవేదన. ప్రభుత్వం ఎంతోమంది జైలు అధికారులు, పోలీసులను శాశ్వత ఉద్యోగులుగా నియమించుకుని పెద్ద పెద్ద వేతనాలు ఇస్తున్నప్పుడు... హంతకులకు ఉరి తీసే తలారిని ఎందుకు ఉద్యోగిగా పరిగణించరు? అన్నది సామాజిక మేధావుల ప్రశ్న.


తలారి వారసత్వం..

యాభైఏడేళ్లున్న పవన్‌కు తలారి వృత్తి వంశపారంపర్యంగా వస్తోంది. నాలుగు తరాలుగా వారి కుటుంబం ఈ పనిలో కొనసాగుతోంది. ఆయన ముత్తాత లక్ష్మణ్‌రామ్‌ బ్రిటిష్‌ ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం లాహోర్‌ జైలులో 1931లో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల ఉరితీతలో పాల్గొన్నాడు. తాత మమ్ముసింగ్‌ 1997 వరకు ఇదే వృత్తిలో ఉన్నాడు. తిరిగి ఆ బాధ్యతలు తండ్రి కాలూరామ్‌కు బదిలీ అయ్యాయి. ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల మెడకు ఉరితాడు బిగించాడు. బిల్లారంగాల ఉరిశిక్ష కూడా కాలూ చేతుల మీదుగానే జరిగింది. ఇక పవన్‌ ఈ వృత్తిలో 2014 నుంచీ కొనసాగుతున్నాడు. తమ కుటుంబం తలారి పని చేస్తుందని దగ్గరి బంధువులకు తప్ప ఇతరులకు తెలిసేది కాదు. జైలు అధికారులు కబురుపెడితే వెళ్లి, నిందితులకు ఉరితీయడం, మళ్లీ ఇంటికి వచ్చి ఏదో ఒక పని చేసుకుని బతకడం చేసేవాడు. ఇలా గోప్యంగా సాగుతున్న వ్యవహారం నిర్భయ శిక్ష అమలుతో విపరీత ప్రచారం లభించింది. టీవీల వాళ్లు పవన్‌ ఇంటికి వచ్చి ఆరా తీయడంతో... ఆయన కుటుంబ చరిత్ర చెప్పక తప్పలేదు. వాస్తవానికి పవన్‌ అనేది జైలు రికార్డుల్లో నమోదైన పేరు, అతని అసలు పేరు సిద్దిరామ్‌. పండ్లు, కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించే పవన్‌ ఆదాయం సరిపోక రకరకాల పనులు చేశాడు. సైకిల్‌పై బెడ్‌షీట్లు, బ్లాంకెట్లు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ ... వాటిని అమ్ముకుని బతుకుతున్నాడు. నిర్భయ హంతకులను ఉరి తీశాక అతని జీవితం తలకిందులైంది. వారిని ఉరి తీసింది తనేనని మీడియా ద్వారా విస్తృత ప్రచారం లభించడంతో.. ప్రజలు ఎవరూ తన వద్ద దుప్పట్లు కొనడం లేదని వాపోతున్నాడాయన. ‘నన్ను చూస్తూనే భయ పడుతున్నారు. మహిళలు అయితే దగ్గరకు రావడానికే జంకుతున్నారు. ఆ హంతకులను ఉరి తీశాను కాబట్టి అందరూ నన్ను గొప్పవాడు అనుకుంటారు అనుకున్నాను. వాస్తవంలో అలా జరగలేదు. మొత్తానికి నా ఉపాధి పోయింది. నన్ను మనుషులను చంపిన మనిషిగానే చూస్తున్నారు’ అంటూ వాపోతున్నాడు పవన్‌.  


ఆ శిక్ష వద్దు

మీరట్‌లోని కాన్షీరాం ఆవాస్‌ యోజన కాలనీలోని ఒంటిగది ఇల్లు పవన్‌ నివాసం. ఆయనకు ఏడుగురు సంతానం. ఇద్దరు కొడుకులు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. తాతల కాలం నుంచీ స్వల్ప మొత్తంలో జీవనభృతిని అందిస్తోంది ప్రభుత్వం. పవన్‌ తాతకు నెలకు రెండువందలు, తండ్రికి రెండు వేలు వచ్చేది. తనకు కూడా అదే మొత్తం అందేది. అయితే కొన్నేళ్ల నుంచీ ఆ మొత్తాన్ని పెంచమని అధికారులను అడుగుతుంటే... ఈ మధ్య ఐదు వేల రూపాయలు చేశారు. దోషులకు ఉరి వేయడమంటే మనసును ఎన్నో రకాలుగా సముదాయించుకోవాలి. తలకు ముసుగుకప్పి, మెడకు ఉరిబిగించి, కాళ్లకింద ఆధారాన్ని తొలగించి, గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలేశాక కిందికి దించడం ఎంత భయానక ప్రక్రియ. తన చేతులతో ఒక మనిషి ప్రాణం పోయిందన్న భీతి కొంతకాలం విషాద జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ వృత్తిలో ఎలాగూ ఉండక తప్పదు కాబట్టి... కనీసం ఉరి శిక్షలు పడకపోతే చాలని పవన్‌ తలారి మొక్కుకుంటున్నాడు.  

- బి.నర్సన్‌

Updated Date - 2021-04-04T17:40:00+05:30 IST